Fire Department Announcement on Nampally Accident: నాంపల్లి బజార్ ఘాట్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై అగ్ని మాపక శాఖ కీలక ప్రకటన చేసింది. కెమికల్ డ్రమ్ముల వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని తేల్చిచెప్పింది. బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ లేదని అధికారులు వెల్లడించారు. 'నవంబర్ 13 సోమవారం ఉదయం 9:30 గంటలకు నాంపల్లి బజార్ ఘాట్ లోని భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 21 మందిని రక్షించగలిగాం. భవనం సెల్లార్ లో కెమికల్ డ్రమ్ములు పెట్టారు. ఆ డ్రమ్ముల వల్లే ప్రమాదం జరిగింది. బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ లేకపోవడం గుర్తించాం.' అని అగ్ని మాపక శాఖ ప్రకటించింది.


ఏం జరిగిందంటే.?


సోమవారం ఉదయం నాంపల్లి బజార్ ఘాట్ లోని అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ లోని గ్యారేజీలో కారు రిపేర్ చేస్తుండగా అక్కడే ఉన్న కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో నాలుగో అంతస్తు వరకూ మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 6 ఫైరింజిన్ల సాయంతో తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ప్రమాద ధాటికి దట్టంగా పొగ అలుముకోగా 21 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భవనంలో చిక్కుకున్న వారిని నిచ్చెనల సాయంతో ఫైర్ సిబ్బంది రక్షించారు. 


'కెమికల్ నిల్వలే కారణం'


ఈ భవనం యజమాని రమేశ్ జైశ్వాల్ అపార్ట్ మెంట్ సెల్లార్ లో కెమికల్ నిల్వలు ఉంచి వ్యాపారం చేస్తున్నాడు. ప్రమాదం సమయంలో 30 డ్రమ్ములు పూర్తిగా కాలిపోగా, మరో 100 డ్రమ్ములను అగ్ని మాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనాలు నిల్వ ఉంచడం వల్లే మంటలు ఒక్కసారిగా అంటుకుని వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. కెమికల్ డ్రమ్ములను చాలా రోజులుగా నిల్వ ఉంచినా ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. ఇంతగా కెమికల్స్ నిల్వ చేసినా అపార్ట్ మెంట్ వాసులు గానీ, స్థానికులు గానీ ఎందుకు ఫిర్యాదు చేయలేదని అధికారులు ప్రశ్నించగా, అందుకు వారు మౌనం వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు, రెగ్యులర్ గా తనిఖీలు చేపట్టని విజిలెన్స్ అధికారులు, సేఫ్టీ పరిశీలనలో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపైనా విమర్శలు వస్తున్నాయి. 


కేసు నమోదు


నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 304, 285, 286, ఐపీసీ 9 బీ(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. పరారీలో ఉన్న భవన యజమాని రమేశ్ జైశ్వాల్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. 


పాఠాలు నేర్వలేదా.?


నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. గ్రేటర్ పరిధిలో జరిగిన భారీ ప్రమాదాలను అంతా గుర్తు చేసుకుంటున్నారు. స్వప్నలోక్ ఘటన సమయంలో జీహెచ్ఎంసీ అధికారులు హడావుడి చేశారని, అప్పుడు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేసినా ఫలితం లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ ఏర్పాటు తర్వాత 200 మందికి నోటీసులిచ్చారని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా, బజార్ ఘాట్ లో ప్రమాదం జరిగిన భవనంలో పరిమితికి మించి అంతస్తులు నిర్మించినట్లు తెలుస్తోంది. భవనం మొత్తం 4 ఫ్లోర్లు, పెంట్ హౌస్ నిర్మించారు. బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ లేకపోవడం కూడా నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా అధికారులు ముమ్మర తనిఖీలు చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


మృతుల కుటుంబాలకు పరిహారం


నాంపల్లి ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ప్రాంతాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు కేటీఆర్ వివరించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని, నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ప్రమాదానికి గల కారణాలు, తీసుకున్న చర్యలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ ను గవర్నర్ ఆదేశించారు. అటు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సైతం ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 


Also Read: Compensation to Nampally Fire Accident Deaths Families: నాంపల్లి ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి - మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం