Telangana News: పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్ కోటా కింద ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి సీటు ఇవ్వకపోవడంపై రూత్ జాన్ కొయ్యల చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. దాదాపు రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంపై, జాతీయ వైద్య కమిషన్ పై చేసిన పోరాటం చివరికి సత్ఫలితాన్ని ఇచ్చింది. పట్టుదలతో, దృఢ సంకల్పంతో వివిధ శాఖలు, మంత్రులు, అధికారులు, వ్యవస్థలు, కోర్టులను ఆశ్రయించి.. చివరికి ట్రాన్స్‌జెండర్ విభాగంలో పీజీ వైద్య విద్యలో సీటు దక్కించుకున్నారు రూత్ జాన్. తన హక్కులను సాధించుకోవడానికి రెండేళ్ల పాటు కఠినమైన న్యాయపోరాటం చేసిన తర్వాత హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో అత్యవసర వైద్యంలో సీటు సంపాదించుకున్నారు.
ఖమ్మం నివాసి రూత్ జాన్ కొయ్యల.. హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు 2022 నీట్ పీజీ అడ్మిషన్ కు అర్హత పొందారు షెడ్యూల్డ్ కులానికి చెందిన రూత్ జాన్ కొయ్యల. అర్హత ఉన్నప్పటికీ ఆమెకు పీజీ వైద్య విద్య సీటు దక్కలేదు. ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ కోటా కింద వైద్య విద్యలో తనకు సీటు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ కొయ్యల రూత్ జాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత్ లోని ఇతర ట్రాన్స్‌జెండర్ వైద్యులు పీజీ వైద్య విద్య అభ్యసించారు. అయితే వారు పురుష లేదా స్త్రీ లేదా మేనేజ్‌మెంట్ కోటా కింద నమోదు చేసుకుంటారు. రూత్ జాన్ మాత్రం అందరిలా కాకుండా ట్రాన్స్‌జెండర్ కోటా కింద నమోదు చేసుకోవాలనుకున్నారు. అలాగే ట్రాన్స్‌జెండర్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే 2014 నాటి సుప్రీం కోర్టు నల్సా కేసు తీర్పుకు విరుద్ధంగా, తెలంగాణలో ట్రాన్స్-పీపుల్ లకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల రూత్ జాన్ పీజీ వైద్య విద్య సీటు అందుకునే విషయంలో అడ్డంకులు ఎదుర్కొన్నారు.
ఈ విషయంపై రూత్ జాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పీజీ వైద్య విద్యలో అడ్మిషన్ పొందడానికి రూత్ జాన్ కొయ్యలకు అర్హత ఉన్నా.. సీటు ఎందుకు ఇవ్వలేదనని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే థర్డ్ జెండర్ వారి పట్ల దయతో కాకుండా వారి స్థానంలో ఉండి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఎస్సీ, ఓబీసీ కోటాలలో ప్రవేశాలు పొందిన చివరి అభ్యర్థులు నీట్ పీజీ- 2023 లో పొందిన మార్కుల వివరాలనూ సమర్పించాలనని జాతీయ వైద్య కమిషన్ కు ఆదేశించింది. పట్టు వదలకుండా చేసిన న్యాయ పోరాటంతో రూత్ జాన్ కొయ్యల చివరికి పీజీ వైద్య విద్యలో సీటు అందుకున్నారు.
పీజీ వైద్య విద్య చేసి గైనకాలజిస్టు కావాలన్నది తన కలగా రూత్ జాన్ కొయ్యల తెలిపారు. తాను తన కమ్యూనిటీ సభ్యులకు సేవ చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.