Kadiyam Srihari Comments on KCR: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసీఆర్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన మీడియా ముందుకి కూడా రాలేదు. దీంతో కేసీఆర్ అలిగారంటూ, రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి సంతాప సభలో పాల్గొన్న సందర్భంగా కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం పెద్ద ఇబ్బంది కాదని తెలిపారు. కేసీఆర్ సింహాలా బయటకు వస్తారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 39 సీట్లు వచ్చాయని అన్నారు. మిత్ర పక్షం అయిన ఎంఐఎం పార్టీకి 8 సీట్లు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ వ్యతిరేకంగా ఉండడంతో వారి బలం కూడా తమకే కలుస్తుందని అన్నారు. అందరి సీట్లు కలిపితే తమకు 56 సీట్లు వస్తాయని అన్నారు. సింహం రెండడుగులు వెనక్కి వేస్తోందంటే.. వేటకు సిద్ధమైనట్లేనని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అనే సింహం త్వరలోనే బయటకు వస్తుందని చెప్పారు. ఎవరూ అధైర్యపడొద్దని కడియం శ్రీహరి ధైర్యం చెప్పారు.
ఇటీవలే జడ్పీటీసీ పాగాల సంపత్ రెడ్డి మరణం
బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జెడ్పి ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పార్ధివదేహానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నివాళి అర్పించారు. అనంతరం సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కేటీఆర్ ప్రార్థించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్ రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్ రెడ్డి మరణం ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తను కలచి వేసిందని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపత్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు.