Munugodu bypoll : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఇక ఉప ఎన్నికలు ఎప్పుడనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. దేశ వ్యాప్తంగా లెక్కలు చూసుకుంటే తాజాగా ఖాళీగా ఉన్న స్థానాలన్నింటికీ ఉపఎన్నికలు జరిగాయి. ఎలక్షన్ కమిషన్ మునుగోడుకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తుందనే అనే విషయంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. సాధారణంగా ఎన్నికల కమిషన్ ఒక స్థానం ఖాళీ అయితే ఆర్నెళ్లలోపు ఎన్నికలు నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా ఏమైనా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే వాటితోపాటు కలిపి ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే ఇక రాబోయేది గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లో జరగాలి. ఈసీ అనుకుంటే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే మునుగోడు ఉపఎన్నికలు కూడా జరుగుతాయి. అంటే ఇంకా ఐదు నెలల సమయం ఉంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన రోజు నుంచి ఆర్నెళ్లు అనుకున్నా జనవరి లోపు ఎన్నికలు జరగాలి. దాదాపుగా ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు మునుగోడు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఈ ఐదు నెలలు మునుగోడులో రాజకీయ పార్టీలు ప్రచార హోరు వినిపిస్తుంది. ఈ ఐదు నెలలు మునుగోడుకు వరాల జల్లు, నిధుల వరద పారుతుందా? అని అక్కడి ప్రజలు వేచిచూస్తున్నారు.
రాజగోపాల్ రెడ్డి వెంట ఎవరు?
మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు పెద్ద సవాల్ గా మారనుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గెలుపు చాలా కీలకం. ఈనెల 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ పెట్టునుంది. ఈ సభలో తన బలం, బలగం, సత్తా మొత్తం చాటాలని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చూస్తున్నారు. ఈ బహిరంగసభలోనే కోమటిరెడ్డి మరో బ్రదర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భవిష్యత్ ప్రణాళికపై ప్రకటన ఉండే అవకాశం ఉందని స్థానికంగా సమాచారం. అదే జరిగితే అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వస్తే, మునుగోడులో విజయం కేక్ వాక్ అవుతుందని కోమటిరెడ్డి వర్గీయులు భావిస్తున్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఎవరు?
బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఎవరనే ప్రశ్నతలెత్తుతోంది. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పద్మశాలి కమ్యునిటీ నుంచి, అసరా ఫౌండేషన్ ఛైర్మన్ బోళ్ల శివశంకర్ పేరును కూడా టీఆర్ఎస్ పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ నుంచి మాత్రం రాజగోపాల్ రెడ్డిని ఢీ కొట్టగల సత్తా ఉన్న నేత కోసం పీసీసీ కసరత్తు చేస్తోంది. పాల్వాయి స్రవంతికి పాల్వయి గోవర్థన్ రెడ్డి ఫాలోయింగ్ కలసి వస్తుందని అనుకున్నా, వాళ్లంతా పాతతరం ఓటర్లే. రెండు మండలాల్లో మాత్రం ఆమెకు గట్టిపట్టుంది. అయితే యంగ్ జనరేషన్ లో ఆమెకు అంతగా ప్రజాధరణ లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇక చల్మెడ కృష్ణారెడ్డి ఆర్థికంగా బలవంతుడు కావడం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అనుచరుడు కావడం కలిసొచ్చే అంశం. మరోవైపు పల్లె రవి, చెరుకు సుధాకర్, కైలాష్ నేత లాంటి వాళ్లు ఉన్నా రాజగోపాల్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ను ఢీకొట్టగలిగే సత్తా లేదనేది స్థానిక నాయకత్వం అభిప్రాయం.
కమ్యునిస్టుల ఓటు ఎవరికీ?
కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీకి మార్చడం రాజగోపాల్ రెడ్డి ముందున్న సవాల్. మునుగోడులో బలమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకును బీజేపీకి అనుకూలంగా ఏమేరకు సక్సెస్ అవుతారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పాతతరం కమ్యునిస్టులు ఎటువైపు? గతంలో కొంతమంది కమ్యునిస్టులు కాంగ్రెస్ లో చేరారు. వారు ఇప్పుడు బీజేపీకి ఓటేస్తారా? లేక కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ వైపు మళ్లుతారా? ఆర్నెళ్లలోపు జరగబోయే మునుగోడు ఉపఎన్నికల్లో ఎన్ని కండువాలు మారతాయో? ఎన్ని సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటారో వేచిచూడాలి.