ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పోస్టుమార్టం నిర్వహిస్తున్నాయి. ఎవరికెన్ని ఓట్లు పోలయ్యాయి..? ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్‌ సరళిపై విశ్లేషించుకుంటున్నాయి. ఓ వైపు అత్యధిక మెజార్టీ కలిగిన అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ తామే విజయం సాధిస్తామని ఘంటాపథంగా చెబుతున్నా.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, అది తమకు అనుకూలిస్తుందని భావిస్తోంది. అయితే పోలింగ్‌ పై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 768 ఓట్లు ఉండగా.. 738 ఓట్లు పోలయ్యాయి. 30 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అధికారికంగానే టీఆర్‌ఎస్‌ పార్టీకి 600 వరకు ఓట్లు ఉండగా.. సీపీఐ మద్దతు ఇచ్చింది. అధికారికంగా 116 ఓట్ల సంఖ్యాబలం కలిగిన కాంగ్రెస్‌ పార్టీ పోటీలో నిలవడంతో ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లలో నెలకొన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్‌ పార్టీ తమకు లాభం చేకూరుతుందని భావించింది. 
గోవా క్యాంప్‌ గోల్‌ కొడుతుందా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆది నుంచి వర్గపోరు నెలకొని ఉంది. ఈ జిల్లాలో బలమైన నాయకులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించలేదు. దీంతోపాటు కొత్తగూడెం, వైరా, ఇల్లందు, మణుగూరు నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మొండిచేయి చూపకుండా ఉండేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి వారం రోజులపాటు తిష్టవేసి అసంతృప్త ప్రజాప్రతినిధులను బుజ్జగించి.. వారిని గోవా క్యాంప్‌కు తరలించారు. పది రోజులపాటు ఇక్కడే ఉంచి ఓటింగ్‌ సమయానికి పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చారు. 
కాంగ్రెస్‌ పోటీ చేయడం వల్లే తమకు లాభం చేకూరిందని, అదే లేకపోతే అసలు తమను పట్టించుకునేవారా..? అని పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు బాహాటంగానే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్యాంప్‌నకు తరలించినప్పటికీ ఇన్ని రోజులు తమకు జరిగిన నష్టం నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గోవా క్యాంప్‌ గోల్‌ కొడుతుందా..? లేదా..? అనేది ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. 
క్రాస్‌ ఓటింగ్‌పై కాంగ్రెస్‌ కోటి ఆశలు..
ఓ వైపు టీఆర్‌ఎస్‌ పార్టీ తామే విజయం సాధిస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. క్రాస్‌ ఓటింగ్‌ తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, పక్కాగా ఆ ఓట్లు తమకు వస్తాయని పేర్కొనడం గమనార్హం. ఇదే కాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న వారు చాలా వరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే కాకుండా.. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారారని, వీరంతా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా సంఖ్యాపరంగా తమకు అధికారికంగా ఉన్న ఓట్లు కంటే ఎక్కువ ఓట్లు వస్తే నైతికంగా తామే విజయం సాధించినట్లు అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 
Also Read: Revant Reddy : అమరవీరుల స్థూపం కట్టేది ఆంధ్రా కంట్రాక్టరా ? కేసీఆర్‌కు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలన్న రేవంత్ రెడ్డి !
Also Read: MP Aravind: కవిత ఎంపీగా పోటీ చేస్తారనుకుంటే ఎమ్మెల్సీ అయ్యారు.. 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకుంటా 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి