Foundation Stone For Development Works In Telangana: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌ మైలారం ఇండస్ర్టియల్‌ పార్కుతోపాటు పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, దనసరి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు మొక్కలు నాటారు.


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉద్యోగాల వేటలో నిరుద్యోగులు, ఉపాధి కోసం ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారన్నారు. వలసలకు అడ్డుకట్టే వేయడానికి మారుమూల ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. భూపాలపల్లికి ఇండస్ర్టియల్‌ పార్కు రావడంతో సంతోషదాయకమని, భూపాలపల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలు కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పి పదేళ్లపాటు ఒక్క నోటిఫికేషన్‌ కూడా కేసీఆర్‌ ప్రభుత్వం ఇవ్వలేదని సీతక్క ఆరోపించారు.


గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి ప్రజలకు ఇబ్బందులకు గురి చసిందన్నారు. రేవంత్‌ రెడ్డి తీసుకువచ్చిన భూమాతతో ఈ సమస్యలు తొలగిపోతాయని స్పష్టం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశామని, స్కిల్‌ ఇండియా ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే రుణమాఫీ జరిగిందని, మళ్లీ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఒకేసారి రెండు లక్షల రుణ మాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు. 


భూములు సాగు చేసుకునే రైతులకు పట్టాలు


తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటకు ఇన్సురెన్స్‌, విత్తనాలకు సబ్సిడీ ఇస్తూ రైతును రాజుగా చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందిస్తామన్నారు. ఈ నెలాఖరుకు 4.50 లక్షలు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తామని, ప్రతి గ్రామానికి ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ధరణి గురించి పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ధరణితో బీఆర్‌ఎస్‌ కొంప మునిగిందని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదని, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు గురించి పట్టించుకోలేదని బీజేపీని విమర్శించారు. 


ఒక్కో అడుగు ముందకేస్తూ అభివృద్ధి


రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్టు మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో నీటి వనరులు, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నాయన్నారు. భూపాలప్లి జిల్లాలో రెండు బ్యారేజీలు ఉన్నాయని, గత ప్రభుత్వం భూపాలపల్లి, మంథని నియోజకవర్గాలకు ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని విమర్శించారు. అశాస్ర్తీయంగా బ్యారేజీ నిర్మాణం చేశారని, దీనివల్ల కుంగిపోయిందని ఆరోపించారు. కోటి మందిని స్వశక్తి మహిళా గ్రూపులు సభ్యులుగా చేర్చి లక్షాధికారులను చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 200 పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. భూమాతతో రైతులు నాయకులు చుట్టూ, అధికారులు చుట్టూ తిరగకుండానే సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.