Mohanlal Donation To Wayanad: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడం వల్ల ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందుకే వారికి సహాయం చేయడం కోసం ఎన్నో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక ఈ కష్ట సమయంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా తన పెద్ద మనసును చాటుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్‌గా కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడడానికి ముందుకొచ్చారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. అంతే కాకుండా పర్యటన ముగిసిన తర్వాత దీనిపై స్పందిస్తూ.. ఆయన కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాన్ని అందిస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మోహన్ లాల్.


నన్ను కదిలించాయి..


‘‘వయనాడ్‌లో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎంతోమంది ఇళ్లు కోల్పోయారు. పర్సనల్‌గా ఈ ఘటనలో చాలా నష్టపోయారు. డోర్ఫ్ కెటల్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అత్యవసర సహాయక చర్యల కోసం విశ్వశాంతి ఫౌండేషన్ తరపున రూ.3 కోట్లు విరాళం ఇస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాను. మందక్కైలో కుప్పకూలిపోయిన ఎల్పీ స్కూల్‌ను తిరిగి కట్టించడం మా మొదటి ముఖ్యమైన లక్ష్యం. టీఏ మద్రాస్‌కకు చెందిన 122 ఇంఫ్రాంట్రీ బెటాయలిన్, ఇతర సహాయక చర్యలు చేపడుతున్న సాహసమైన సహాయక చర్యలు నన్ను చాలా కదిలించాయి. వారి నిస్వార్థ సేవలు, కలిసికట్టుగా కమ్యూనిటీగా ఉండడం చూస్తుంటే మళ్లీ ఆశ చిగురిస్తోంది. మనందరం కలిసికట్టుగా కోలుకుందాం, ధృడంగా ముందుకు అడుగేద్దాం’’ అంటూ ప్రజలకు ధైర్యాన్ని అందించారు మోహన్ లాల్.






మొదటి విడత..


విశ్వశాంతి అనేది మోహన్ లాల్ స్వయంగా స్థాపించిన సంస్థ. ఈ ఎన్జీఓ ద్వారా ఇప్పటికే ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి సాయం చేశారు. ఇప్పుడు వయనాడ్ బాధితులకు కూడా రూ.3 కోట్లు విరాళం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ‘వయనాడ్‌కు ఇది కొత్త వెలుగు. కూలిపోయిన జిల్లాను మళ్లీ కలిసి నిర్మించడానికి విశ్వశాంతి ఫౌండేషన్ సిద్ధమయ్యింది. మొదటి విడతగా ఈ ఫౌండేషన్ నుంచి రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. కలిసికట్టుగా కోలుకోవడానికి మాతో కలిసి అడుగేయండి’’ అంటూ విశ్వశాంతి ఫౌండేషన్ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఫౌండేషన్ నుంచి వయనాడ్‌కు మరింత ఆర్థిక సాయం అందనుందని అర్థమవుతోంది. వయనాడ్‌లో ప్రజల కష్టాలను చూసిన చాలామంది సినీ సెలబ్రిటీలు విరాళాలు అందించారు. కానీ మోహన్ లాల్ మాత్రం తానే స్వయంగా వచ్చి అక్కడి పరిస్థితులను గమనించడం అభినందనీయం అంటున్నారు నెటిజన్లు.



Also Read: వయనాడ్ విలయం - చలించిపోయిన ‘2018’ హీరో టోవినో థామ‌స్, భారీగా ఆర్థిక సాయం