Telangana Minister KTR is infected with Corona :  తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒంట్లో నలతగా ఉండటం.. స్వల్ప లక్షణాలు కనిపిస్తూండటంతో ఆయన టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్టుల్లో పాజిటివ్ అని రావడంతో ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని కేటీఆర్ కోరారు. 



కేటీఆర్‌కు రెండో సారి కరోనా పాజిటివ్ 


కేటీఆర్‌కు కరోనా సోకడం ఇది రెండో సారి. గత ఏడాది కూడా ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పట్లో కొన్ని శ్వాస కోశ సమస్యలు కూడా తలెత్తాయని కేటీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. అయితే రెండు రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత తగ్గిపోయాయన్నారు. ఇప్పుడు కూడా స్వల్ప కరోనా లక్షణాలే ఉన్నందున ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కేటీఆర్ ప్రికాషన్ డోస్ కూడా తీసుకున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో కరోనా .. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కూడా వస్తోంది. అయితే స్వల్ప లక్షణాలతో తగ్గిపోతోంది. కొంత మందికి సోకినా లక్షణాలు బయటపడటం లేదు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని సార్లు తగ్గుతున్నాయి. చాలా మంది కరోనా లక్షణాలు కనిపిస్తేనే టెస్టులు చేయించుకుని ఐసోలేట్ అవుతున్నారు. 


కాలు ఫ్రాక్చర్‌ నుంచి ఇటీవలే  కోలుకున్న కేటీఆర్ 


కేటీఆర్ ఇటీవలే ఇంట్లో ప్రమాదానికి గురయ్యారు. కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో మూడు వారాల పాటు బెడ్ రెస్ట్‌కే పరిమితమయ్యారు. ఇటీవలే ఆయన  కోలుకుని స్వల్పంగా నడవగలుగుతున్నారు. మళ్లీ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా రావడంతో మరికొద్ది రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే గతంలోలా ఇప్పుడు కరోనాకు రెండు వారాల పాటు ఐసోలేషన్‌లోఉండటం లేదు. నాలుగైదు రోజుల తర్వాత టెస్టులు చేయించుకుని మళ్లీ విధుల్లోకి వెళ్తున్నారు. 


త్వరగా కోలుకోవాలని అభిమానుల సందేశాలు


కరోనా సోకిన విషయం గురించి కేటీఆర్ సోషల్ మీడియాలో చెప్పడంతో చాలా మంది అభిమానులు త్వరలో కోలుకోవాలని అభిలాషిస్తున్నారు.