Harish Rao Tweets On Rahul Gandhi: ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో కాలుపెట్టక ముందే అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, తెలంగాణ మంత్రులు విమర్శలు మొదలుపెట్టారు. వాటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే తెలంగాణలో కాలుపెట్టాక రాహుల్ గాంధీ అడిగిన ఒకప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర రైతుల పట్ల రాహుల్ గాంధీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో విమానాశ్రయంలో దిగగానే అర్థమైందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు.
తెలంగాణ రైతులు చైతన్యవంతులని, రాహుల్ అడిగిన ప్రశ్న గురించి తెలిస్తే వాళ్లు అలాంటి నేతను అసలు నమ్మరని, కచ్చితంగా అది రైతు సంఘర్షణ సభ కానే కాదని, రాహుల్ సంఘర్షణ సభ అని వారికి తెలిసిపోతుందన్నారు మంత్రి హరీష్ రావు. ‘రాహుల్ గాంధీ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ - చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ - రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారు’ అని హరీష్ రావు అన్నారు.
‘ఎయిర్ పోర్టులో దిగి ఇవ్వాల ఏం మాట్లాడాలి, సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీకి తెలంగాణ రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం గురించి నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమేనని’ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వరుస ట్వీట్లు చేశారు.
రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్‌లో కీలకమైన అంశాలు
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ
- రైతులు, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ. పదిహేను వేల పెట్టుబడి సాయం
- ఉపాధి హామీలో నమోదు చేసుకున్న ప్రతి రైతు కూలీకి ఎటా రూ. పన్నెండు వేల ఆర్థిక సాయం
- మెరుగైన పంటల బీమా
- గిరిజనులకు భూమిపై యాజమాన్య హక్కులు
- మిర్చి మద్దతు ధర రూ. పదిహేను
- వరికి కనీస మద్దతు ధర రూ. రెండున్నర వేలు
- పత్తికి మద్దతు ధర రూ. ఆరున్నరవేలు
-కందులు క్వింటాల్‌కు మద్దతు ధర రూ. ఆరు వేలు
- మొక్కజొన్న మద్దతు ధర రూ. రెండు వేల రెండు వందలు
- తెలంగాణలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తాం
- భూమి లేని రైతులకు రైతు బీమా పథకం వర్తింపు
- ధరణి పోర్టర్ రద్దు
- నకిలీ విత్తనాల నివారణకు కఠిన చట్టం
- నూతన వ్యవసాయ విధానం
- రైతు కమిషన్ ఏర్పాటు
- మూతపడిన చెరుకు ఫ్యాక్టరీల రీ ఓపెనింగ్