Warangal Declaration :   వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించింది. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ డిక్లరేషన్‌ను ప్రకటించారు. రైతులకు సంబంధించిన కీలకమైన సమస్యలన్నింటికీ ఈ డిక్లరేషన్‌లో పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. మొదట రేవంత్ రెడ్డి ఈ డిక్లరేషన్‌ను ప్రకటిస్తే తర్వాత  రాహుల్ గాంధీ తన ప్రసంగంలోనూ ప్రస్తావించి...  డిక్లరేషన్ ప్రకటన మాత్రమే కాదని అమలు చేయడం కాంగ్రెస్ బాధ్యతని ప్రకటించడంతో ఈ డిక్లరేషన్‌కు  మరింత ప్రాధాన్యం ఏర్పడింది.  

డిక్లరేషన్‌లో కీలకమైన అంశాలు ఇవి

- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ- రైతులు, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ. పదిహేను వేల పెట్టుబడి సాయం-  ఉపాధి హామీలో నమోదు చేసుకున్న ప్రతి రైతు కూలీకి  ఎటా రూ. పన్నెండు వేల ఆర్థిక సాయం - మెరుగైన పంటల బీమా- గిరిజనులకు భూమిపై యాజమాన్య హక్కులు- మిర్చి మద్దతు ధర రూ. పదిహేను - వరికి కనీస మద్దతు ధర రూ. రెండున్నర వేలు- పత్తికి మద్దతు ధర రూ. ఆరున్నరవేలు

-కందులు క్వింటాల్‌కు మద్దతు ధర రూ. ఆరు వేలు- మొక్కజొన్న మద్దతు ధర రూ. రెండు వేల రెండు వందలు- తెలంగాణలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తాం- భూమి లేని రైతులకు రైతు బీమా పథకం వర్తింపు- ధరణి పోర్టర్ రద్దు - నకిలీ విత్తనాల నివారణకు కఠిన చట్టం 

- నూతన వ్యవసాయ విధానం- రైతు కమిషన్ ఏర్పాటు 

-  మూతపడిన చెరుకు ఫ్యాక్టరీల రీ ఓపెనింగ్

కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌పై రాజకీయవర్గాల్లోనూ విస్తృత చర్చ జరిగుతోంది.ఈ ఎన్నికల్లో రైతు ఎజెండాను తీసుకుని వెళ్తున్నందున వ్యవసాయానికి  సంబంధించి కాంగ్రెస్ ప్రణాళిక మొత్తం  ఈ డిక్లరేషన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను  పరిష్కరించేలా అన్ని అంశాలను ఈ డిక్లరేషన్‌లో పొందు పరిచారు.  కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటన కాదని..   కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ రకంగా ఎన్నికల మేనిఫెస్టో తరహాలో ఈ డిక్లరేషన్‌ను ప్రత్యేకంగా సిద్ధంగా చేశారు. రైతుల్లో డిక్లరేషన్‌పై విస్తృతంగా చర్చజరిగేలా చేసే ఉద్దేశంతో వ్యహాత్మకంగా రాహుల్ గాంధీ సమక్షంలోనే ఈ డిక్లరేషన్‌ను ప్రకటించారు.  రేవంత్ రెడ్డి డిక్లరేషన్ ప్రకటిస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న రైతులు, సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది.  దీంతో డిక్లరేషన్ లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.