Telangana Loksabha Election Schedule 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. దేశంలో మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందగా.. ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానానికి మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువరిస్తారు. ఏపీ, తెలంగాణలో నాలుగో విడతలో భాగంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. లోక్ సభతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్ సభ ఎన్నికల పోలింగ్ (మే 13) జరగనుండగా.. అదే రోజు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సైతం నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలివే
☛ ఎన్నికల నోటిఫికేషన్ - ఏప్రిల్ 18
☛ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 25
☛ నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26
☛ ఉపసంహరణకు ఆఖరు తేదీ - ఏప్రిల్ 29
☛ పోలింగ్ తేదీ - మే 13
☛ ఎన్నికల కౌంటింగ్ - జూన్ 4న ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఇదే!
దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఏపీలో నాలుగో విడతలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. 26న నామినేషన్ల పరిశీలించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు ఛాన్స్ ఇచ్చారు. మే 13న ఎన్నికలు నిర్వహించి, జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ముఖ్యమైన తేదీలివే
ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ - ఏప్రిల్ 18
నామినేషన్లు ప్రారంభం - ఏప్రిల్ 18
నామినేషన్లు తుది గడువు - ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణ - ఏప్రిల్ 29
ఏపీలో ఎన్నికలు - మే 13
ఓట్ల లెక్కింపు - జూన్ 4
అటు, దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు నమోదు చేసుకున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటింగ్ కోసం దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. దాదాపు 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే అధికం. దాదాపు కోటిన్నర మంది అధికారులు ఎన్నికల ప్రక్రియలో భాగం కానున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేస్తామని వివరించారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు (Vote From Home) అవకాశం కల్పిస్తామన్నారు. 'బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ ఉంటుంది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో రూ.3,400 కోట్లు సీజ్ చేశాం. సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారులను నియమిస్తాం. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్లను వాడుతాం. ఎవరైనా హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాం. రెండోసారి ఓటు వేయడానికి కేసు బుక్ చేస్తాం.' అని స్పష్టం చేశారు.