RS Praveen Kumar thanks to KCR and KTR after his defeat in Nagarkurnool: హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు సత్తా చాటాయి. 8 స్థానాల్లో బీజేపీ, మరో 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల్లో ఓటమిపై స్పందించారు.


మల్లు రవికి RSP అభినందనలు 
తనకిచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించలేకపోయినందుకు నిరాశగా ఉందన్నారు. బీఆర్ఎస్ కుటుంబంలో తాను సభ్యుడ్ని అయినందుకు గర్వంగా ఉందన్నారు. తనను నమ్మి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి అవకాశం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు. నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి, డా. మల్లు రవికి అభినందనలు తెలిపారు.


ఎన్నికల్లో సహకరించిన వారికి ధన్యవాదాలు 
‘లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో వ్యయప్రయాసలకు ఓర్చుకొని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతికూల చర్యలకు పాల్పడినా లొంగలేదు. కాంగ్రెస్ దాడులకు బెదరకుండా పార్టీనే నమ్ముకొని నన్ను జనంలోకి నడిపించిన వనపర్తి మాజీ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డికి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో పార్టీ జెండా మోసిన పార్టీ నాయకులకు, సమన్వయకర్తలకు, ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా వారియర్స్ కు, స్వేరోలకు, ఆరెస్పీ అభిమానులకు థ్యాంక్స్. నాగర్ కర్నూల్ ఎన్నికల్లో ఈ నడిగడ్డ మట్టి బిడ్డను విశ్వసించి ఆదరించి 3,19,216 ఓట్లతో ఆశీర్వదించిన ప్రతి ఓటరుకు పాదాభివందనం. మీ రుణం తీర్చుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదలనని’ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.