Telangana Liquor Shops closed during Teacher MLC Election in state
తెలంగాణలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ 3 జిల్లాల్లో మద్యం దుకాణాలు (Wine Shops Closed for MLC Elections) మూతపడనున్నాయి. కాగా ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని, ఈ జిల్లాల్లో ఈ సమయంలో మద్యం విక్రయించరాదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.




ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 18, తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. తెలంగాణలో 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 9వ తేదీన షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, ఫిబ్రవరి 23 వరకూ నామినేషన్లు స్వీకరించారు.


మార్చి 13న (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరుగుతుంది. మార్చి 16న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నది ఎన్నికల కమిషన్. కాగా, మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం మార్చి 29తో, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్‌ హసన్‌ జాఫ్రీ పదవీకాలం మే 1తో ముగియనున్నది. దీంతో ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.