Gutta Sukhender Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ నేతలు కూడా స్పందిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. అధికార బీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు బాబు అరెస్ట్‌ను ఖండించారు. బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు మాత్రమే స్పందించగా.. మరికొంతమంది నేతలు మొన్నటివరకు సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అరెస్ట్‌ను బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి ఖండిస్తూ వస్తోన్నారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించగా.. శుక్రవారం శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా బాధకరమని, తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రతిపక్ష నేతలను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేయడం సరైన పద్దతి కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని, అలాంటి సీనియర్ నేతను జైల్లో పెట్టడం బాధగా అనిపిస్తుందని తెలిపారు. చంద్రబాబు కేసు విషయంలో ఏం జరుగుతుందనేది కోర్టులే తేలుస్తాయని, న్యాయ విషయాలపై తాను మాట్లాడనని అన్నారు. కానీ విచారణ పూర్తయ్యేంత వరకు ఎవరూ నేరస్తులు కాదన్నారు. అవినీతి జరిగిందా..? లేదా? అనే విషయాన్ని కోర్టులే తేల్చాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవాళ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వ్యవహారంపై కూడా స్పందించారు. మెత్కుపల్లికి ఉపఎన్నికల్లో మద్దతు ఇవ్వనని గతంలో పార్టీ అధినేతకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల నిజామాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలపై గుత్తా ఫైర్ అయ్యారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కేసీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. ఎన్నికల కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని, బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ఈ ఎన్నికల్లోనే తీసుకురావాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అటు కేసీఆర్ గత కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ ప్రగతిభవన్‌లో చికిత్స పొందుతుండగా.. సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి గుత్తా వివరించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు జ్వరం పూర్తిగా తగ్గిందని, కానీ కాస్త నీరసంగా ఉన్నారని వెల్లడించారు. త్వరలోనే కేసీఆర్ బయటకు వచ్చి ప్రజలను కలుస్తారని తెలిపారు. కేసీఆర్ త్వరలో పూర్తిగా కోలుకుంటారని అన్నారు. కేసీఆర్ మిస్సింగ్ అయ్యారని, కనిపించడం లేదంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా దీనిపై సోషల్ మీడియాలో కూడా బీజేపీ ట్రోల్స్ చేస్తోంది. కేసీఆర్ కనిపించడం లేదని పోస్టర్లు వైరల్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే శాసనమండలి కార్యాలయంలో జరిగిన చిట్‌చాట్‌లో కేసీఆర్ ఆరోగ్యంపై గుత్తా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.