తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 69,892 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వాటిల్లో కొత్తగా 1,061 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,79,971కి చేరింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటలలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,102కి చేరింది. కరోనా నుంచి సోమవారం 3,590 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 21,470 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం 274 కేసులు నమోదయ్యాయి.


రాష్ట్రంలో ముగిసిన థర్డ్ వేవ్ 


తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇకపై ఐటీ కార్యాలయాలకు కూడా వర్క్ ఫ్రం హోం అవసరం లేదని చెప్పారు. థర్డ్ వేవ్ తెలంగాణలో ముగిసినందున ఇక నుంచి రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఊపిరి పీల్చుకొనే సమయం వచ్చిందని అన్నారు. జనవరి ఫస్ట్ నుంచి థర్డ్ వేవ్‌‌‌‌ మొదలైందని, జనవరి 17, 18వ తేదీ నాటికి ఈ వేవ్ పీక్‌‌‌‌ స్టేజ్‌కి వెళ్లిందని చెప్పారు. జనవరి మూడో వారం నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చిందని అన్నారు. ఇంకో వారం, పది రోజుల్లో థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ ముగిసిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత గతంలో లాంటి పరిస్థితులు నెలకొంటాయని, ఆంక్షలు ఏమీ ఉండబోవని చెప్పారు. కరోనా మూడు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని పట్టి పీడించిందని శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణలో కరోనా పాజిటివీటి రేటు రెండు శాతం మాత్రమే ఉందని తెలిపారు. ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందని అన్నారు. ఇకపై ఎలాంటి ఆంక్షలు అక్కర్లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంక్షలు మొత్తం తీసివేసిందని డీహెచ్ వివరించారు.


కరోనా థర్డ్ వేవ్ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ‌ఎక్కువగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. కరోనా కేసులు, కోవిడ్‌ వ్యాప్తి పరంగా చూసినా పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా కేసులు నమోదైయ్యాయని తెలిపారు. థర్డ్‌ వేవ్‌ మొదలైన 18 రోజుల్లోనే పీక్స్‌లోకి వెళ్లిందని.. ఇప్పటికే పూర్తిగా తగ్గాల్సి ఉన్నా ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీఏ 2 సబ్ వేరియంట్ మొదలుకావడం ఆలస్యమైందని చెప్పారు. ఇక, కోవిడ్‌ కొత్త వేరియంట్లు, కరోనా వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల గురించి భయపడాల్సిన అవసరమే లేదని భరోసా ఇచ్చారు.