Pending Traffic Challans Clearance : తెలంగాణలో  ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 31వ తేదీ వరకు రాయితీతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించవచ్చునని అధికారులు వెల్లడించారు. అయితే తెలంగాణ (Telangana)లో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాల చెల్లింపు గడువు నేటితో ముగియనుండగా.. కొందరు పండుగ, ఇతరత్రా కారణాలతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేకపోయారు. వారిని దృష్టిలో ఉంచుకుని మిగతా వాహనదారులు సైతం ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో రాయితీని సద్వినియోగం చేసుకునేందకు జనవరి 31 వరకు తుది గడువు పొడిగించారు.


ట్రాఫిక్ చలాన్లు రాయితీలతో చెల్లించేందుకు వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. డిసెంబరు 25 వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ ఇచ్చింది. పెండింగ్ చలాన్లతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 113 కోట్లు ఆదాయం సమకూరింది. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాల చలాన్లపై 60% డిస్కౌంట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల రికార్డుల ప్రకారం 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. ఇందులో 80 లక్షల మందికిపైగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించారు. దాదాపు 70 కోట్ల రూపాయలు పెండింగ్ చలాన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు చేయవచ్చు.