Junior Doctors Meet With Health Minister: తమ సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని జూనియర్ డాక్టర్లు (Junior Doctors) రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఈ క్రమంలో సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో (Damodara Raja narasimha) జూడాలు చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని.. మరికొన్ని అంశాలపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆయా అంశాలపై ప్రతిపాదనలను కూడా మంత్రి ఉన్నతాధికారులకు పంపించినట్లు పేర్కొన్నారు.


జూడాలు ఏం చెప్పారంటే.?


వైద్యుల భద్రత గురించి మంత్రి ఆలోచిస్తామన్నారని.. స్టైఫండ్‌కు గ్రీన్ ఛానల్‌పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు జూడాలు వెల్లడించారు. అయితే, సమ్మె కొనసాగింపుపై రాష్ట్ర స్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. అప్పటివరకూ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 


ఇవీ డిమాండ్లు


తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం, వైద్య కళాశాలలో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు ఛాన్స్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇలా పలు డిమాండ్లతో సమ్మెకు దిగారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను సైతం పరిష్కరించాలని కోరుతూ.. 5 రోజుల క్రితం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వం తరఫున ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ జూడాలతో చర్చలు జరిపారు.


అటు, జూనియర్ డాక్టర్ల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ క్రమంలో పలు ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


Also Read: Telangana News: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ - ఒకే రోజు 44 మందికి స్థానచలనం