BRS MLAs is creating new problems in the Congress :  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సైడ్ ఎఫెక్టులు ఆ పార్టీకి కనిపిస్తున్నాయి. కొత్తగా చేరే వారి వల్ల కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన సంజయ్ కుమార్ ఇలా హ్యాండివ్వడంతో బీఆర్ఎస్ లో పెద్ద సంచలనం అయింది. అయితే ఈ చేరిక కాంగ్రెస్ లోనూ అలజడికి కారణం అవుతోంది.                     


జగిత్యాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ అయిన  తాటిపర్తి జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన చాలా  ఆయన 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మొదట టీడీపీ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్నుంచి జగిత్యాల నుంచి ఆయనే పోటీ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఆయన వరుసగా మూడు సార్లు ఓడిపోయారు. గత రెండు సార్లు ఆయనపై బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచారు. సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.                                       


తనపై గెలిచిన  బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కనీసం తనకు చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడంపై తాటిపర్తి జీవన్ రెడ్డి అసహనానికి గురయ్యారు. తనకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకంటానని ఆయన చెబుతున్నారు.2018లో ఓడిపోయిన తర్వాత ఆయన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయినప్పటికీ గత ఎన్నికల్లో ఆయనకు జగిత్యాల నుంచి టిక్కెట్ లభించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కూడా టిక్కెట్ లభించింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ పరాజయం పాలయ్యారు.                      


ఇప్పుడు సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరితే ఇక తనకు  రాజకీయ భవిష్యత్ ఉండదని ఆయన అనుకుంటున్నారు. తన సీనియార్టీకి తగ్గట్లుగా ఓడిపోయినప్పటికీ మంత్రి పదవి వస్తుందని ఆయన అనుకుంటున్నారు .కానీ అలాంటి చాన్స్ లేకపోగా ఇప్పుడు తన సీటుకే ఎసరు పెడుతున్నారని ఆయన నమ్ముతున్నారు. జీవన్ రెడ్డి అసంతృప్తి గురించి తెలుసుకుని కాంగ్రెస్ నేతలు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నలభై ఏళ్ల పాటు చేసిన రాజకీయంలో గౌరవంగా బతికానని ఇప్పుడు ఇలాగే కొనసాగితే తన గౌరవం పోతుందని.. రాజకీయాల నుంచి విరమించుకుని వ్యవసాయం చేసుకుంటానని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతున్న చేరికల వల్ల మరికొన్ని సైడ్ ఎఫెక్టులు కనిపించే అవకాశాలు ఉన్నాయి.