Ntr Statue HighCourt :  ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల రోజున ప్రారంభించాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో మొత్తం  14 పిటిషన్స్ దాఖలయ్యాయి.  శ్రీ కృష్ణ JAc,  అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ్ సంఘం  వంటి సంస్థలు పిటిషన్లు వేశాయి. 


ఖమ్మంలోని ‘లకారం ట్యాంక్‌బండ్‌పై’ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందు కోసం దాదాపుగా వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని రెడీ చేయించారు.  28వ తేదీన ఈ విగ్రహావిష్కరణకు ‘జూనియర్ ఎన్టీఆర్’ ‌ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉది.  మంత్రి పువ్వాడ అజయ్ సారథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను కృష్ణుడి రూపంలో పెట్టడంతో భవిష్యత్ తరాల వారు ఎన్టీఅరే కృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందని, హిందూ యాదవ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.  ఎన్టీఆర్‌ను మహానటుడుగా, అభిమాన నాయకునిగా అభిమానించినా భగవంతుని స్థాయిలో పోల్చరాదని వారంటున్నారు.   యాదవ, కమ్మ సంఘాల వారి ఓట్ల కోసమే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వారే కోర్టులకు వెళ్లారు. 


సినీ నటి కరాటే కళ్యాణి కూడా   ఈ విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు.  ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆధ్వర్యంలో హిందూ, యాదవ ఆందోళన కూడా నిర్వహించారు.. జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించారు..ప్రభుత్వ స్థలం లో ప్రైవేట్ కార్యక్రమం కు ఎలా అనుమతి ఇచ్చారు..అని ప్రశ్నించారు. అయితే   కరాటే కళ్యాణి అభ్యంతరాలను  ఖమ్మం బీఆర్ఎస్ లో ఉన్న యాదవ ప్రతినిధులు ఖండించారు.  ఖమ్మం లో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆమె వ్యవహరిస్తుందని బి ఆర్ ఎస్ యాదవ ప్రతినిది పగడాల నాగరాజు తెలిపారు. ఖమ్మం లో ఉన్న యాదవులు ఎవరిని ఆమె సంప్రదించలేదని.. ఆమె వెనుక ఎవరో ఉండి రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.. సూట్ కేసు ల్లో డబ్బులు తీసుకొని.. అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
  


శ్రీ కృష్ణుడు రూపం లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కొంత మంది యాదవ సంఘం నేతలు చెబుతున్నారు.  విగ్రహ ఏర్పాటు పై రాజకీయం చేయడం తగదంటున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూండగానే.. కోర్టు స్టే ఇవ్వడంతో.. నిర్వాహకులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆ రోజున ప్రారంభిస్తే గొప్పగా ఉంటుందని అనుకుంటున్నారు. న్యాయపరమైన అడ్డంకులు రావడంతో  ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.