Congress War Room Case: కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ వాలంటీర్ల నిర్బంధంపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెలువరించింది. వాలంటీర్ల నిర్బంధంపై విచారణకు ఆదేశించింది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్‌లో సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. వారిని అక్రమంగా నిర్బంధించారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లురవి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.


ఇదీ జరిగింది? 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఎస్కే కార్యాలయంలో కంప్యూటర్, లాప్ టాప్‌లు సీజ్ చేశారు పోలీసులు. సీఎం కేసీఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపణలతో పోలీసులు కార్యాలయానికి సీజ్ చేశారు. కొంత కాలంగా ఎస్కే టీమ్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు. పోలీసులు నోటీసులు ఇవ్వకుండా కార్యాలయాన్ని సీజ్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కార్యాలయం సీజ్ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. 


సునీల్ ఆపన్నహస్తం పేరిట రెండు ఫేస్ బుక్ పేజ్‌లను నిర్వహిస్తున్నారని సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నేతలపై కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారన్న కారణంతో ఎస్కే ఆఫీస్‌పై దాడి చేశారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రతాప్‌, శశాంక్‌, ఇషాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలు అని పేర్కొన్న పోలీసులు ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41(ఎ) కింద నోటీసులు జారీచేసి.. వివరణతో గత ఏడాది డిసెంబర్ 30న తమ ముందు హాజరుకావాలని సూచించారు. 


సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సునీల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు  కొట్టివేసింది. అయితే అతనిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఈ నెల 3వ తేదీన హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణకు హాజరు కావాలని సునీల్‌ కనుగోలుకు సూచించింది. అలాగే ఈ కేసులో వ్యూహకర్త సునీల్ కనుగోలును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. దానితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో సీఆర్‌పీసీ 41A కింద మల్లు రవికి నోటీసులు అందజేశారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో అసలేం జరుగుతుంది? అక్కడ ఏం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? పూర్తి వివరాలపై వారిని ఆరా తీశారు.