Jithender Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సీట్ల మంటలు అంటుకున్నాయి. ఆదివారం తొలి విడుత అభ్యర్థుల ప్రకటనల అనంతరం ఆ పార్టీలో ఒక్క సారిగా అసంతృప్తి జ్వాలలు ఎగిశాయి. ఉప్పల్ కాంగ్రెస్‌ పార్టీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై స్థానిక నాయకులు  మండిపడుతున్నారు. రాష్ట్ర పీసీసీ సెక్రటరీ పూడూరి జితేందర్ రెడ్డితో సహా 200 నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారు. అనంతరం జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డి అనర్హుడని అన్నారు. 


సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నిందించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు.పార్టీలో పరిణామాలు చూస్తుంటే.. అందరూ అన్నట్లు ఈయన రేవంత్ రెడ్డి కాదని, రేటెంత రెడ్డి అనే పదానికి పూర్తి అర్హుడనిపిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్ధి పరమేశ్వర్ రెడ్డి  వసూల్ రాజా అని, ఒక బైక్ మెకానిక్ వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కార్పొరేటర్‌గా ఉంటూ కోట్లు వసూల్ చేశారని, దీని వెనుకు రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. 


ఉప్పల్‌లో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ను మోస్తున్న వారిని కాదని, రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతూ, సీఎం సీఎం అని నినాదాలు చేసిన వారికి, గుమ్మం దగ్గర కాపలా ఉన్నవారికి మాత్రమే టికెట్లు కేటాయించాడని ఆరోపించారు. కేసులు ఉంటేనే సీట్లు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్ధి పరమేశ్వర్ రెడ్డి అక్రమాలు, వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న పలు కేసులను వివరించారు. బెదిరింపులకు, రౌడీయిజానికి మారుపేరు పరమేశ్వర్ రెడ్డి అని ఆరోపించారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామని జితేందర్ రెడ్డి, ఉప్పల్ వైఎస్సార్, ఆర్ఎల్ఆర్ వర్గీయులు హెచ్చరించారు. 


సింగిరెడ్డి ధ్వజం
రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆదివారం తన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయానని, BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి బారిన పడిన తన లాంటి బాధితులను కలుపుకుని కొడంగల్‌లో ఆయన్ను ఓడిస్తానని సవాల్ చేశారు. ఉప్పల్‌లో తనకు టికెట్ ఇస్తే గెలుస్తానని సర్వేలన్నీ చెప్పాయని, కానీ రేవంత్ టికెట్ ఇవ్వలేదన్నారు. కనీసం సెకండ్ ఆప్షన్‌గా కూడా తన పేరు స్క్రీనింగ్ కమిటీలో పెట్టలేదని అన్నారు. గత తొమిదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేశానని, ఎన్ని కష్టాలు ఎదురైన పార్టీతోనే ఉన్నానన్నారు. 2014, 2018లో టికెట్ ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించారన్నారు. 2023లో కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


పరమేశ్వర్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డికి లేదని, BRS అభ్యర్థిని గెలిపించాలని రేవంత్ చూస్తున్నాడంటూ ఆరోపించారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చి.. పార్టీని నాశనం చేయాలని రేవంత్ చూస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలో టీడీపీలాగా పార్టీని నాశనం చేసి ప్రాంతీయ పార్టీ స్థాపించాలని రేవంత్ చూస్తున్నారని, సీఎం పదవి కోసం ప్రైవేట్ ఆర్మీని నిర్మించుకున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని అన్నారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌ ప్రజలు తన్నితే మల్కాజిగిరిలో తాము గెలిపించుకున్నామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చిందని సోమశేఖర్ రెడ్డి మండిపడ్డారు.