MLAs Poaching Case : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం జరిగిందన్న కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకు విడుదలచేసిన సాక్ష్యాల ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫాంహౌస్ కేసు వీడియోలు, ఆడియోలు దర్యాప్తు దశలోనే లీక్ అవ్వడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైప్రొఫైల్ కేసులో దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు ఎలా బయటికి వెళ్ళాయని అడిగారు.  సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని పిటిషనర్లు కోర్టుకలో వాదించారు. ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా ఏసీబీతో ఎందుకు విచారణ జరిపించలేదని పిటిషనర్ తరుపున న్యాయవాది వాదించారు. సెక్షన్ 17(b) ప్రకారం మెట్రోపాలిటన్ నగరాల్లో ఏసీపీ స్థాయి అధికారి పీసీ యాక్ట్ కేసులను విచారించవచ్చని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. 


అయితే 2003లో ఏసీపీ పరిధిని ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని...దాని ప్రకారం 2003 నుంచి నమోదైన పీసీ యాక్ట్ కేసులన్నీ ఏసీబీనే విచారించాలని పిటిషనర్ వాదించారు. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని  శుక్రవారం తుది వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇదే కేసులో హైకోర్టులో విచారణ జరిగినప్పుడు  ప్రధాన న్యాయమూర్తి సీఎం కేసీఆర్ నుంచి తనకు కవర్ అందిందని.. వాటిలో ఏముందని ప్రభుత్వ తరపు లాయర్‌ను ప్రశ్నించారు. కోర్టులను రాజకీయాల్లోకి లాగడం ఎందుకన్నారు. ఈ అంశానికి సంబంధించి కోర్టుకు క్షమాపణలు చెప్పిన లాయర్..కేసీఆర్ వద్ద నుంచి వచ్చిన కవర్‌ను చెత్తబుట్టలో పడేయాలన్నారు. తాను అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఫామ్ హౌస్ కేసు ఫైల్స్ ఆధారాలు పంపినట్లుగా కేసీఆర్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. 


అయితే కేసీఆర్ ప్రత్ేయకంగా పంపిన ఆధారాలను న్యాయమూర్తి అప్పట్లో పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించిన ఆధారాలను పరిశీలిస్తామని హైకోర్టు చెప్పడం ఆసక్తికరంగా మారింది. శుక్రవారమే తుది విచారణ చేపడతామని చెప్పడంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఏసీబీ కోర్టులో ఈ కేసులో అదనంగా నలుగురు నిందితుల్ని చేరస్తూ సిట్ దాఖలు చేసిన మెమోను న్యాయమూర్తి తిరస్కరించారు. అసలు ఈ కేసును సిట్ ఎలా దర్యాప్తు చేస్తుందని.. ఏసీబీ దర్యాప్తు చేయాలన్నారు. ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపైనే వాదనలు జరుగతున్నాయి. 


ఘటన జరిగిన తరువాత ఇన్ని రోజులకు 164 సీఆర్పీసీ స్టేట్మెంట్ రికార్డ్ చేయడాన్ని పిటిషనర్లు తప్పు పడుతున్నారు.  ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా పీసీ యాక్ట్ కింద ఏసీబీ విచారణ చేయాలంటున్నారు.  అవినీతి నిరోధక చట్టం2002  కింద నమోదైన కేసులన్నీ ఏసీబీ పరిధిలోకి వస్తాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దీనికి సంబంధించిన జీవో కూడా ఉందని గుర్తు చేశారు. జీవో ప్రకారం పీసీ యాక్ట్ కేసులన్నీ ఏసీబీ పరిధిలోకి వాదిస్తున్నారు. మరో వైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌పైనా విచారణ జరుగుతోంది.