Farmhouse Case To CBI :  తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసును సీబీఐకి  బదిలీ చేస్తూ తెలంగాణ  హైకోర్టు సంచలన నిర్ణయం లతీసుకుంది. సుదీర్గ వాదన తర్వాత హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొదట ఏసీబీ కేసును నమోదు చేశారు. తర్వాత హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. కానీ ఈ కేసును ఏసీబీ మాత్రమే విచారించాలని..  సిట్ ఎలా దర్యాప్తు చేస్తుందని ఏసీబీ కోర్టు .. సిట్ దాఖలు చేసిన నివేదికల్ని తిరస్కరించింది. అలాగే.. ఈ కేసులో కీలక నిందితులు సిట్ దర్యాప్తు కుట్ర పూరితంగా జరుగుతోందని.. విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. 


సిట్ ఏర్పాటును కొట్టి వేసిన తెలంగాణ హైకోర్టు 


ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తునుంచి సిట్‌ను తప్పించి.. సీబీఐ లేదా హైకోర్టు నియమించే ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజి,   న్యాయవాది బీ శ్రీనివాస్‌, తుషార్‌ వెల్లపల్లి తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనలు జరిగాయి. అవినీతి కేసులను ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, సాధారణ పోలీసులు చేయరాదంటూ పిటిషనర్లు వాదించారు.  అయితే అవినీతి ఆరోపణల కేసులను ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని లేదని, ఇతర పోలీసులు కూడా దర్యాప్తు చేయవచ్చునని తెలంగాణ ప్రభుత్వ లాయర్లు వాదించారు.  ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సిట్  ఏర్పాటును కొట్టి వేస్తూ.. కేసును సీబీైకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 


ఇప్పటికే ఎమ్మెల్యేల ఎర కేసులో ఈడీ కూడా విచారణ 


ఇప్పటికే ఈ కేసులో  ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) కూడా విచారణ జరుపుతోంది. నిందితుడు నందకుమార్ ను జైల్లోనే కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తోంది. సోమవారం.. మంగళవారం ప్రశ్నించనుంది. ఈ కేసులో బీజేపీ ప్రోద్భలంతో నందకుమార్ తనను ప్రలోభ పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. వంద కోట్లు ఇస్తామన్నారని ఆయన చెప్పారు.  రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు నందుకుమార్‌‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ నం.‌ 967/2022, మొయినాబాద్‌ పీఎస్‌లో నమోదైన ఫామ్‌హౌస్‌ కేస్‌ ఎఫ్‌ఐఆర్‌‌ నం.455/2022 కేసులు నమోదయ్యాయి. వీటిలో  ప్రివెన్షన్ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ 2002, సెక్షన్‌50 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈఎస్‌ఐఆర్‌)‌/48/20‌22 రిజిస్టర్‌‌ చేసినట్లు ఈడీ ప్రకటించారు.    


ఫిర్యాదుదారుడినైన తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని రోహిత్ రెడ్డి ఆరోపణ


మరో వైపు ఫామ్ హౌస్ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి ఈడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నందకుమార్ నుంచి స్టేట్ మెంట్ తీుకుని తనను నిందితుడిగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిపై తాను హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ లోపే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.