Credit Cards on UPI: దాదాపు 25 కోట్ల మంది భారతీయులు తమ రోజువారీ లావాదేవీల కోసం యూపీఐని (Unified Payments Interface - UPI) ఉపయోగిస్తున్నారు. దాదాపు 5 కోట్ల మంది వినియోగదారులు వద్ద ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) డేటా ప్రకారం... క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీ గత మూడు సంవత్సరాల్లోనే 30 శాతం పెరిగింది. అంటే, క్రెడిట్‌ కార్డ్స్‌ వినియోగిస్తున్న వాళ్ల సంఖ్య, ఉపయోగించుకుంటున్న మొత్తం విలువ గణనీయంగా పెరుగుతోంది.


ఇక, బ్యాంక్‌ ఖాతాను అనుసంధానించి, యూపీఐ ‍‌(Unified Payments Interface - UPI) ద్వారా చెల్లింపులు చేయడం మనందరికీ తెలుసు. పెరుగుతున్న క్రెడిట్‌ కార్డ్స్‌ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇటీవలే, `రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ` ‍‌(RuPay Credit Card on UPI) ఫీచ‌ర్‌ను నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించింది. ఈ ఫీచర్‌ కింద, ప్రతి రోజూ 50 లక్షల రూపాయల విలువైన UPI లావాదేవీలు జ‌రుగుతున్నాయి. ప్రస్తుతం.. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India - UBI), ఇండియ‌న్ బ్యాంక్ (IIndian Bank), పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (Punjab National Bank- PNB) ఈ ఫీచర్‌ కింద యూపీఐ సేవ‌లు అందిస్తున్నాయి. దేశంలో ఎక్కువ క్రెడిట్ కార్డ్స్‌ జారీన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) తెచ్చిన‌ కొత్త UPI ఫీచ‌ర్‌ కూడా మంచి స్పందన అందుకుంది.


ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ క్రెడిట్‌ కార్డ్స్‌
ఇప్పుడు, ఎస్‌బీఐ కార్డ్‌ (SBI Ccrd ), ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) కూడా తమ క్రెడిట్ కార్డ్‌హోల్డర్లకు శుభవార్త చెబుతున్నాయి. 2023 మార్చి నెలాఖ‌రు నాటికి ఈ మూడు బ్యాంక్‌లు కూడా UPI ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. ప్రస్తుతం, రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ సేవ‌లు అందించడానికి సాంకేతికతను అనుసంధాన పనిలో ఉన్నాయి. ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తయితే, లావాదేవీలు మ‌రింత భారీగా పెరిగే అవకాశం ఉంది.


`పే నౌ` ‍‌(Pay Now) ఫెసిలిటీ కింద యూపీఐ సేవ‌ల‌తో క్రెడిట్ కార్డుల‌ను లింక్ చేయ‌డానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ ఏడాది జూన్‌ నెలలో అనుమ‌తించింది. 


బ్యాంక్‌ ఖాతాను లింక్‌ చేసుకుని యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లే, ఇకపై క్రెడిట్‌ కార్డ్‌ను లింక్‌ చేసుకుని యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. క్రెడిట్‌ కార్డ్‌ - యూపీఐ లింకింగ్‌ వల్ల చెల్లింపు ప్రాసెస్‌ మరింత సులభం అవుతుంది. చెల్లింపుల విధానంలో భద్రత ఇంకా పెరుగుతుంది. స్వైపింగ్ మెషీన్ల వద్ద క్రెడిట్‌ కార్డ్స్‌లోని సమాచారాన్ని స్కిమ్మింగ్ లేదా కాపీ చేసే ముప్పు ఇకపై ఉండదు. అంతేకాదు, కస్టమర్లు ఇకపై చెల్లింపుల కోసం తమ క్రెడిట్ కార్డ్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా... క్రెడిట్‌ కార్డ్‌ దొంగతనం, పోగొట్టుకోవడం వంటి కష్టాలు ఆగిపోతాయి. కార్డ్‌ మరిచిపోయి షాపింగ్‌కు వెళ్లినా, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.


ప్రస్తుతం రూపే కార్డ్‌కే ఉన్న UPI ఫెసిలిటీని మాస్టర్‌ కార్డ్‌, వీసా వంటి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కూడా విస్తరించే అవ‌కాశాలు ఉన్నాయి.