వంగావీటి మోహనరంగాను చంపగలిగే సత్తా ఏ వ్యక్తికీ లేదని, వ్యవస్థే ఆయనను చంపిందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 34 ఏళ్ల క్రితం ఆనాడు వంగవీటి రంగాను హత్య చేసిన వారు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. రంగా చావుకు టీడీపీనే కారణం అని ఆరోపించారు. రాజకీయంగా రంగాను ఎదుర్కొలేకే అంతం చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రంగా పేరు వాడకుండా రాజకీయం చేయలేని దుస్థితికి టీడీపీ చేరిందని అన్నారు. రంగాను పొట్టనపెట్టుకున్న పార్టీలు కూడా నేడు దిగజారి మాట్లాడుతున్నాయని విమర్శలు చేశారు. వంగవీటి రంగాను తొక్కేయాలని అందరూ అడుగడుగునా ప్రయత్నించారని అన్నారు. అది సాధ్యం కాకపోవడంతో భౌతికంగా అడ్డుతొలగించుకున్నారని అన్నారు. 


‘‘రంగా హత్య వ్యవహారంలో చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉంది. రంగా హత్య కేసులో దేవినేని ఉమ, వెలగపూడి రామకృష్ణ ముద్దాయిలు. రంగా చావుకు కారణమైన వ్యక్తులు కూడా ఈ రోజు ఆయన బూట్లు నాకుతున్నారు. రంగా హత్య కేసులో ముద్దాయిలు టీడీపీలోనే ఉన్నారు. నేను టీడీపీలో ఉన్నప్పుడు ఓసారి రాధాను కలిస్తే చంద్రబాబు క్లాస్‌ పీకారు. ఇప్పుడు అదే టీడీపీ ఆయన కోసం వెంపర్లాడుతోంది. 


వంగవీటి రంగా కుటుంబంతో నాకు అనుంబంధం ఉంది. వంగవీటి రాధా మా కుటుంబ సభ్యుడు. రాధాతో మా ప్రయాణం పార్టీలకు అతీతం. మరణించే వరకు రంగా ఆశయాలను కొనసాగిస్తాం. గుడివాడలో ఎవరు గెలవాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఇచ్చిన హామీలను అమలుచేశాం. గుడివాడలో నన్ను ఓడించడం కష్టం. గుడివాడ ఓటర్లు నా భవిష్యత్తుని నిర్దేశిస్తారు. మాకు ఏ పార్టీతో పొత్తు అక్కర్లేదు. మేం ఎవరి బూట్లు నాకబోము’’ అని కొడాలి నాని అన్నారు.


రంగా క్రేజ్‌ను వాడుకొనేందుకు ఎగబడుతున్న మూడు పార్టీలు


కాపు సామాజిక వర్గంలో వంగవీటి రంగాకు ఉన్న అభిమానాన్ని, క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. అందుకే నిన్న వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన కుమారుడు రాధాతో పాటు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. నేడు వర్థంతి కార్యక్రమంలో వంగవీటి రాధాతో పాటుగా టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.


మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చంపేస్తామని వైసీపీ నేత మెరుగుమాల కాళీ ఫోన్ చేసి బెదిరించాలని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రంగా వర్థంతి కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. రంగా వర్థంతి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ కుట్ర చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మెరుగుమాల కాళీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడని టీడీపీ నేతలు అంటున్నారు. రావిని చంపేస్తామని బెదిరించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. దమ్ముంటే రావిని టచ్ చేయాలని కార్యకర్తలు సవాల్ చేశారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో గుడివాడలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు పోలీసులు.