ఉస్మానియా విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముఖా ముఖి కార్యక్రమానికి అనుమచి ఇచ్చే విషయాన్ని వైస్ చాన్సలర్‌కు హైకోర్టు వదిలేసింది. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం కోసం పెట్టిన అప్లికేషన్‌ని పరిశీలించాలని ఓయూ వైస్ ఛాన్సలర్‌ని హైకోర్టు ఆదేశించింది. వీసీకి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. రాహుల్ పర్యటన అనుమతిని హైకోర్టు ఓయూ వైస్ ఛాన్సలర్ నిర్ణయానికి వదిలేసింది. పిటీషనర్లు పెట్టుకున్న దరఖాస్తును ఓయూ వీసీ పరిగణనలోకి తీసుకుంటారని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ తరుపు న్యాయవాదులు కోర్ట్‌కు హాజరు కాలేదు. వీసికి దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించడంతో పిటిషన్‌పై విచారణ ముగిసినట్లయింది. ఈ నెల 6, 7 తేదీల్లో తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీని రాహుల్ సందర్శించి... అక్కడి విద్యార్థులతో ముచ్చటించాల్సి ఉండగా... అడ్మినిస్ట్రేషన్ అనుమతినివ్వలేదు. అయితే యూనివర్శిటీ ఈ విషయాన్ని నిర్వాహకులకు రాత పూర్వకంగా తెలియజేయలేదు. కానీ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రాహుల్ పర్యటనకు అనుమతినివ్వలేదని చెప్పడంతో రాజకీయ వివాదం ప్రారంభమయింది.
టిఆర్‌ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా యూనివర్శిటీపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 2017 నుండి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రాజకీయ కార్యకలాపాలతో పాటు అన్ని విద్యాయేతర కార్యక్రమాలను నిషేధించిందని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవల తేజస్వి సూర్య లాంటి బీజేపీ నేతలు ఉస్మానియా పర్యటనకు అనుమతి ఇచ్చారని రాహుల్ గాంధీ పర్యటనను మాత్రమే వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేతలు పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
హైకోర్టు సూచన మేరకు మరోసారి కాంగ్రెస్ నేతలు వీసికి అప్లయ్ చేయనున్నారు. వీసి అనుమతించినా ఇవ్వకపోయినా రాహుల్ గాంధీ ఉస్మానియాలో పర్యటిస్తారని కాంగ్రెస్ నేతలంటున్నారు.