తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విషయంలో కౌంటర్ దాఖలు చేయనందుకు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి వారికి కొన్ని నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ దాఖలైన పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు సీఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిల్ గత విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించగా.. దాదాపు 10 నెలలైనా ఎలాంటి కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని, సీఎస్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
రాష్ట్రంలో రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్లలో దాదాపు 40 నుంచి 50 మంది అధికారులకు నెలల తరబడి పోస్టింగులు ఇవ్వడం లేదని, వారు ఎలాంటి విధులు నిర్వహించకుండా ఖాళీగా ఉన్నప్పటికీ నెలనెలా జీతాలు మాత్రం ఇస్తున్నారని మాజీ ఉద్యోగి బి.నాగధర్ సింగ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మంగళవారం దీనిపై మరోసారి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలిల ధర్మాసనం విచారణ జరిపింది.
ఇందులో భాగంగా ‘‘పోస్టింగ్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ విభాగం ఉన్నతాధికారి నుంచి ఆ ఉద్యోగులకు చెల్లించిన జీతభత్యాలను వసూలు చేయాలి. క్రమశిక్షణా చర్యలు చేపట్టాలి’’ అని హైకోర్టు అభిప్రాయపడింది. ఆ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషన్‌పై సీఎస్ ఇంకా కౌంటర్ వేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలుకు మరో 4 వారాలు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. విధులు నిర్వహించకపోయినా జీతాలు చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశమంటూ విచారణను వాయిదా వేసింది. మార్చికి వాయిదా వేసింది.
మార్చి 14లోగా కౌంటర్ దాఖలు చేయాలని, లేకపోతే సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. ప్రభుత్వంలో ఏ విభాగాల్లో ఎంత మంది అధికారులు పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉన్నారు? ఎంత మంది ఖాళీగా ఉన్నా జీతాలిస్తున్నారు? తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
Also Read: రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ తల్లిదండ్రులపై కేసు ? విచారణకు రావాలని విజయవాడ పోలీసుల నోటీసులు !
Also Read: ఇండస్ట్రీకి మంచి రోజులు ముందున్నాయి... జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి