Telangana High Court: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేసింది. మల్లారెడ్డి వేసిన నామినేషన్‌లో తప్పులు ఉన్నాయంటూ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషనర్ అంజిరెడ్డి (Anji Reddy) హైకోర్టులో పిటిషన్ వేశారు.


మల్లారెడ్డి నామినేషన్‌ తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. అయితే అఫిడవిట్‌లో అభ్యంతరాలపై ఫిర్యాదుదారుడికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానం ఇచ్చినట్లు హైకోర్టుకు ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో మల్లారెడ్డి ఆఫిడవిట్‌పై వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.


వివాదం ఏంటంటే?


మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడకగా మారిందని, మల్లారెడ్డి ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో తప్పులున్నాయని రాంపల్లి దాయారా గ్రామ నివాసి, స్థానిక ఓటర్ కందాడి అంజిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మేడ్చల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి గత సోమవారం ఆయన ఫిర్యాదు చేశారు.  


మల్లారెడ్డి తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌ను తప్పుగా చూపించినట్లు అంజిరెడ్డి ఫిర్యాదు చేశారు. 3 ఎన్నికల్లో 3 రకాలుగా ఎడ్యుకేషన్ వివరాలు తప్పుగా వెల్లడించారని పేర్కొన్నారు. ఆయన ఆస్తుల విషయంలో తప్పుడు వివరాలు సమర్పించారని చెప్పారు. 1973లో ఇంటర్ చేసినట్లు మల్లారెడ్డి చూపించారని, అయితే, గత 3 ఎన్నికల అఫిడవిట్లలో 3 వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివినట్లుగా చూపించారని ఆరోపించారు.


'మల్లారెడ్డి గత, ప్రస్తుత అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఇంటర్మీడియట్ 3 కాలేజీల్లో చదివారు. 2014 ఎన్నికల్లో మల్లారెడ్డి ఎంపీగా పోటీ చేశారు. ఆ సమయలో సమర్పించిన అఫిడవిట్‌లో తాను ప్యాట్నీ గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంటర్ చదివినట్లుగా పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో తాను వెస్లీ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదివినట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ప్రస్తుతం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసినట్లు మంత్రి అఫిడవిట్ సమర్పించారు.' అని అంజిరెడ్డి వివరించారు.


'వయసు విషయంలోనూ తప్పులు'


'మల్లారెడ్డి తన అఫిడవిట్‌లో 2014 ఎన్నికల్లో తన వయసు 56గా పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో తన వయసు 70గా చూపించారు. అంటే.. 9 ఏళ్లలోనే మల్లారెడ్డి వయసు 14 ఏళ్లు పెరిగింది.' అని అంజిరెడ్డి పేర్కొన్నారు. మల్లారెడ్డి అఫిడవిట్‌లో చదువుతో పాటు ఆస్తుల వివరాలు సైతం తప్పుగా ఉన్నాయని, ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని ప్రత్యర్థులు సైతం డిమాండ్ చేశారు. 


జోరుగా మల్లారెడ్డి ప్రచారం


అటు, ఎన్నికల ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో నిర్వహించిన రోడ్ షోలో నృత్యం చేస్తూ ఓటర్లను ఆకట్టున్నారు. ఎన్నికల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఖేల్‌ ఖతం, దుకాణం బంద్‌ తప్పదని మంత్రి అన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కారు జోరు కొనసాగుతుందని, అభివృద్ధి తెలియని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తే కాంగ్రెస్‌కు పతనం తప్పదని మండిపడ్డారు. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.