Israel Gaza War: 


నెతన్యాహుని కాల్చేయండి: కాంగ్రెస్ ఎంపీ 


కాంగ్రెస్ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్‌ (Rajmohan Unnithan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని (Benjamin Netanyahu) కాల్చి పారేయాలని అన్నారు. ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేశారు. కేరళలోని కాసర్‌గడ్‌లో పాలస్తీనా పౌరులకు మద్దతుగా భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రాజ్‌మోహన్‌ నెతన్యాహుపై మండి పడ్డారు. వెనకా ముందు ఆలోచించకుండా నెతన్యాహుని (Israel-Hamas War) కాల్చేయాలని ఫైర్ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, యూకే, అమెరికా కలిసి  International Military Tribunal (IMT)ని ఏర్పాటు చేశాయి. యుద్ధ నేరాలతో పాటు యుద్ధ సమయాల్లో దారుణంగా హింసించడం లాంటివి చేసిన నేతల్ని Nuremberg Trial పేరుతో కాల్చి చంపేవాళ్లు. ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు కాంగ్రెస్ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్. ఎలాంటి ట్రయల్స్ నిర్వహించకుండానే నేరుగా శిక్ష విధించే వాళ్లు. ఇప్పుడు నెతన్యాహుకి కూడా ఇదే విధంగా శిక్ష వేయాలని తేల్చి చెప్పారు రాజ్‌మోహన్. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) నవంబర్ 23వ తేదీన కొజికోడ్‌లో ర్యాలీ నిర్వహించనుంది. పాలస్తీనా పౌరులకు మద్దతుగా ఈ ర్యాలీ జరగనుంది. AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ఈ ర్యాలీకి నేతృత్వం వహించనున్నారు. 


"రెండో ప్రపంచ యుద్ధం తరవాత యుద్ధ నేరాలకు పాల్పడిన వాళ్లకి Nuremberg trials పేరుతో శిక్ష విధించే వాళ్లు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వాళ్లను ఎలాంటి ట్రయల్స్ నిర్వహించకుండానే కాల్చి చంపేవాళ్లు. ఇప్పుడిదే మోడల్‌ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ప్రపంచం ముంది నెతన్యాహు ఓ యుద్ధ నేరస్థుడిగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తిని వెనకా ముందు ఏమీ ఆలోచించకుండా కాల్చి చంపేయాలి. అంత దారుణమైన హింసకు పాల్పడుతున్న వ్యక్తికి ఇదే సరైన సమాధానం"


- రాజ్‌మోహన్ ఉన్నితన్, కాంగ్రెస్ ఎంపీ 


ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై (Israel Hamas War) ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను ఖండించారు. Global South Summitలో మాట్లాడిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నామని, ఈ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు భారత్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. దౌత్యం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. హింసని, ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. ఈ యుద్ధాన్ని కట్టడి చేసే విషయంలో Global South దేశాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. 


"పశ్చిమాసియా ప్రాంతంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతో మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు భారత్‌ ఎంతగానో ప్రయత్నిస్తోంది. చర్చలు, దౌత్యం ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. అమాయక ప్రజల ప్రాణాల్ని తీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలస్తీనా అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్‌తో ఇప్పటికే మాట్లాడాను. పాలస్తీనా ప్రజలకు అవసరమైన మానవతా సాయం అందించాం. భారత్‌తో పాటు అన్ని దేశాలూ ఒక్కటై అక్కడి ప్రజలకు అండగా నిలబడాల్సిన అవసరముంది"


- ప్రధాని నరేంద్ర మోదీ


Also Read: CEO Mira Murati: డీప్‌ఫేక్ వీడియోలపై ChatGPT కొత్త సీఈవో కీలక వ్యాఖ్యలు, ఏమన్నారంటే?