తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై డీహెచ్ శ్రీనివాసరావు న్యాయస్థానికి నివేదిక సమర్పించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తుందని మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫీవర్ సర్వేలో 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తుందనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. కరోనా తీవ్రంగా ఉంది అనేందుకు జ్వర బాధితులే నిదర్శనమని పేర్కొన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం అందించే.. కిట్లలో అవసరమైన మందులు లేవని.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని.. ఏజీ స్పందించారు.
ఈ వాదనలు విన్న ధర్మాసనం.. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం అమలు కాకపోవడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని.. ఆదేశించింది. అంతేకాకుండా.. పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు డీహెచ్‌ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.


పాఠశాలలు ప్రారంభించే అవకాశం


మరోవైపు తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలను తెరిచి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కారణంగా ఈ నెల 30 వరకు సెలవులను పొడిగించింది ప్రభుత్వం. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా... సీరియస్ కేసులు లేకపోవడం, త్వరగానే నయంఅవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తుంది.  దీంతో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 31 నుంచి, లేదా ఫిబ్రవరి రెండో వారం నుంచి తరగతులు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే పిల్లలను పాఠశాలలకు పంపాలా, ఆన్‌లైన్‌ తరగతులు ఎంచుకోవాలా? అనేది తల్లిదండ్రులకు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. 


ఆన్ లైన్ క్లాసులు 


కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవుల‌ను 30వ తేదీ వరకూ పొడ‌గించింది. క‌రోనా కేసులు భారీగా పెరిగిన కారణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జ‌న‌వ‌రి 30 వ‌ర‌కు సెలవుల‌ను పొడగించింది. అయితే విద్యార్థులు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని గత సోమ‌వారం నుంచి 8, 9, 10 త‌ర‌గతుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాల‌ని ఆదేశించింది. అయితే మరో ఐదు రోజుల్లో సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లను తిరిగి తెరిచే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యక్ష త‌ర‌గ‌తుల‌ను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వచ్చే ఐదు రోజుల్లో కేసులు సంఖ్య భారీగా పెరిగినా, ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోయినా సెల‌వులు మ‌రో వారం పొడిగించి ఆ తర్వాత స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది.


Also Read: TS Schools: ఈ నెల 31 నుంచి విద్యాసంస్థలు తెరిచే అవకాశం... ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు...!


Also Read: Poisonous Snake: పాముకు ముద్దులు పెడుతూ ఫొటోలకు పోజులు.. కొన్ని గంటలకు ఏమైందంటే..!