Telangana High Court allowed KTR to take the lawyer to the ACB office : న్యాయవాది సమక్షంలోనే ఏసీబీ విచారణకు హాజరవ్వాలని పట్టుదలగా ఉన్న కేటీఆర్ ఆ మేరకు హైకోర్టు నుంచి కొంత మేర రిలీఫ్ పొందారు. ఆయనతో పాటు ఏసీబీ కోర్టుకు లాయర్ ను తీసుకు వెళ్లవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే విచారణను దూరం  నుంచి చూడటానికి మాత్రమే అవకాశం ఉంటుంది ... విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. లైబ్రరి విండో నుంచి విచారణ చూడొచ్చని ఏసీబీ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి హైకోర్టు అంగీకారం తెలిపింది.  విచారణలో అభ్యంతరాలు ఉంటే కేటీఆర్ మరోసారి హైకోర్టుకు రావొచ్చని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఉత్తర్వులు జారీ చేసింది. 


కేటీఆర్‌తో న్యాయ‌వాదిని అనుమ‌తించాల‌ని అడ్వ‌కేట్ ప్ర‌భాక‌ర్ రావు వాదించారు. గ‌తంలోనూ లాయ‌ర్ అనుమ‌తికి సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చిందని  ..వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి విచార‌ణ సంద‌ర్భంగా ఇదే హైకోర్టు న్యాయ‌వాదికి అనుమ‌తి ఇచ్చింద‌ని వాదించారు. అయితే న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి ఇవ్వలేదని.. ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్న విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ కేసులో తాము ఇచ్చిన ఆర్డర్‌ కాపీ చదివారా అని హైకోర్టు ప్రశ్నించింది. 


న్యాయవాదిని అనుమతించిన పలు సుప్రీం కోర్టు తీర్పులను కేటీఆర్‌ తరపు న్యాయవాది ప్రస్తావించగా.. న్యాయవాదిని విచారణ సందర్భంలో అనుమతి ఇవ్వని పలు తీర్పులను ఏఏజీ రజనీకాంత్ రెడ్డి ప్రస్తావించారు. ఏసీబీ విచారణ సమయంలో కనిపించేంత దూరంలో న్యాయవాది కనిపించేలా విచారణ గదులు ఉన్నాయా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. లైబ్రరీలో కూర్చోవచ్చని ఏసీబీ తరపులాయర్ చెప్పారు. దాంతో విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేస్తూ లైబ్రరీలో కూర్చుని విచారణ చూసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.   విచారణ గదిలోకి నిందితుడితో న్యాయవాదిని కలిసి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ ఉపయోగించరు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. 


తమ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు పోలీసులు తప్పుడు స్టేట్ మెంట్ రాసుకున్నారని అలా తన విషయంలోనూ రాసుకుంటారని..అందుకే లాయర్ సమక్షంలో విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అది తన రాజ్యాంగపరమైన హక్కు అంటున్నారు. అందుకే ఇటీవల ఆయన ఏసీబీ ఆఫీసు వరకూ వెళ్లినా లాయర్ ను అనుమతించలేదని తిరిగి వచ్చేశారు. దీంతో ఏసీపీ 9వ తేదీన మళ్లీ విచారణకు రావాలని.. ఈ సారి కూడా ఎలాంటి లాయర్లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఈ కారణంగా కేటీఆర్ విచారణకు ముందు రోజు.. హైకోర్టును ఆశ్రయించి విచారణను లాయర్ చూసే అవకాశం పొందారు. ఈ కేసు విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ న్యాయపోరాటం చేస్తూనే విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు.