హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు ఓ కొండ చిలువలు రోడ్డుపైకి వస్తున్నాయి. నగరంలో ఒకే రోజు రెండు చోట్ల కొండ చిలువలు రోడ్లపైకి వచ్చాయి. నిత్యం రద్దీగా ఉండే కూకట్‌పల్లి, ప్రగతినగర్‌ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొండచిలువ రోడ్డుపై దర్శనమిచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ట్రాఫిక్ ఏర్పడింది. అది రోడ్డు దాటుకునే వరకు వాహనదారులు ఎదురుచూశారు. పైగా దానిని ఏ బండి ఢీకొట్టకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. దీనికి సంబంధిత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


రోడ్డుపై కొండచిలువ కనిపించడంతో అప్పటి వరకూ బిజిగా తిరిగే వాహనాలు సడన్‌గా ఆగిపోయాయి. ట్రాఫిక్ సిగ్నల్ పడినట్లు వాహనదారులు ఆగిపోయారు. కొండ చిలువ రోడ్డు దాటి అలా పొదల్లోకి వెళ్లిపోయింది. వాహనదారులు దానిని ఫోటోలు, వీడియోలు తీశారు. దీనికి సంబంధించి  ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాన రహదారిపై కొండచిలువ కనిపించడం స్థానికులు కొంత కలవపాటుకు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం, వాగులు ప్రవహిస్తుండడంతో పాము తన సహజ ఆవాసాల నుంచి బయటకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అనుకోని అతిథి రోడ్డుపై కనిపించడంతో స్థానికులు వీడియో, ఫొటోలు తీసుకున్నారు. 


పాముతో జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌కు యువకుడు 


లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో మోకాలు లోతు నీరు చేరి ఇబ్బంది పడుతున్నారు హైదరాబాదీలు. ఈ వర్షాలతో పాటు బురద, చెత్తా చెదారం, వ్యర్థాలు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. వీటితో పాటు క్రిమికీటకాలు, పాములు కూడా వస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్ శివారు అల్వాల్ ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తి ఇంట్లోకి వాన నీటితో పాటు పాము కూడా వచ్చింది. దీంతో సంపత్ కుమార్ అనే యువకుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు. ఇలా ఇంట్లోకి పాములు వస్తుంటే చాలా భయంగా ఉందని అధికారులు తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. 


సంపత్ ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా... జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఓ వైపు వర్షాలు, మోకాలి లోతు నీళ్లు, మరోవైపు ఇంట్లోకి వస్తున్న పాములు, క్రిములు.. దీంతో సంపత్ కుమార్ తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. అధికారుల తీరుపై అసహనంతో సంపత్ కుమార్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులను జడుసుకునేలా చేసింది. సంపత్ ఏం చేశాడంటే..


ఇంట్లోకి వస్తున్న పాముల్లో ఒక దానిని ఎలాగోలా సాహసం చేసి పట్టుకున్నాడు. దానిని అలాగే పట్టుకుని స్థానిక జీహెచ్ఎంసీ ఆఫీసుకు తీసుకెళ్లాడు. ఓ అధికారి టేబుల్ మీద ఆ పామును వదిలిపెట్టాడు. సంపత్ కుమార్ చేసిన పనికి జీహెచ్ఎంసీ అధికారులు భయాందోళనకు గురయ్యారు. 


వరద నీరు వచ్చి ఇంట్లోకి పాములు కూడా వస్తుంటే భయపడి హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తే పట్టించుకోకపోవడంపై సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోందని సంపత్ మండిపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.  


కుత్బుల్లాపూర్‌లో మరొకటి..
నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భూమిలోప‌ల ఉండే జీవ‌రాసులు నీటి ఉధృతికి త‌ట్టుకోలేక బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. హైద‌రాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో గురువారం ఓ కొండచిలువ రోడ్డు మీద‌కు వచ్చింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్ అంబీరు చెరువు కట్ట వద్ద రోడ్డుపై ఈ 8 అడుగుల కొండచిలువ క‌నిపించ‌డంతో దారిలో వెళ్లేవారు ఫోటో క్లిక్‌మ‌నిపించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీనికి తోడు ఇళ్లలోకి పాములు రావడం ఆందోళన కలిగిస్తోంది.