Telangana News : తెలంగాణలో మాతాశిశు సంరక్షణ పై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. సురక్షిత డెలివరీల కోసం సిబ్బందికి మిడ్ వైఫరీ కోర్సులో శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ఇండియా మెచ్చుకున్నది. ఈ నేపథ్యంలో యునిసెఫ్ ఇండియా తన ట్విట్టర్‌లో ఇవాళ ఓ పోస్టు చేసింది. హైదరాబాద్‌లోని ఓ ఏరియా ఆస్పత్రిలో మిడ్ వైవ్స్ ద్వారా పురుడు పోసుకున్న ఓ శిశువు ఫోటోను యునిసెఫ్ ఇండియా తన ట్విట్టర్ పోస్టులో జత చేసింది. మెటర్నిటీ కేర్ అంశంలో తెలంగాణ సర్కార్ గౌరవప్రదమైన రీతిలో పనిచేస్తున్నట్లు యునిసెఫ్ పేర్కొన్నది. పురుడు సమయంలో తల్లులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పాజిటివ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్ కలిగే రీతిలో మిడ్‌వైవ్స్‌కు శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ అభినందించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణను ఫెర్నాండేజ్ ఫౌండేషన్, యూనిసెఫ్ సాంకేతిక సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా ఐదు ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్నారు. మిడ్ వైవ్స్ శిక్షణలో గర్భిణులు సాధారణ ప్రసవాలు జరుగడానికి తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామం, సాధారణ ప్రసవాల వల్ల లాభాలు, గర్భిణికి సాధారణ ప్రసవాలపై విశ్వాసం కలిగేలా ఏవిధంగా చేయాలి అన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రపంచ సంస్థలు గుర్తించడం తెలంగాణకే గర్వకారణంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అందుకు ఇది ఒక నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన మార్పులు తీసుకు వచ్చింది. నార్మల్ డెలివరీలు చేసేందుకు వైద్య సిబ్బందికి ప్రోత్సాహం ఇస్తోంది. బిడ్డ పుట్టిన తర్వాత.. పుట్టక ముందు కూడా గర్భిణులకు పౌష్టీకాహారం అందించే ప్రణాళికలు అమలు చేస్తోంది. కేసీఆర్ కిట్స్.. పౌష్టీకాహార కిట్స్ వంటి వాటిని పంపిణీ చేస్తున్నారు.