Rishabh Pant Accident:


టీమ్‌ఇండియా యువ కెరటం రిషభ్ పంత్‌కు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తామని బీసీసీఐ తెలిపింది. అతడి నదురుపై రెండు చోట్ల గాట్లు పడ్డాయని, కుడి మోకాలిలో చీలిక వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది.


ఉత్తరాఖండ్‌ లోని రూర్కీలో  రిషబ్‌ పంత్‌  ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న  కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. కారు దగ్ధమయ్యే లోపే స్థానికులు అతడిని రక్షించారు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌  వెళ్తుండగా దిల్లీ, డెహ్రడూన్ హైలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగ్గానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో పంత్‌ కిందికి దూకేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఒంటరిగా డ్రైవ్‌ చేస్తుండగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది.




'రిషభ్ పంత్‌ నుదురుపై రెండు గాట్లు ఉన్నాయి. కుడి మోకాలిలోని లిగమెంట్లలో చీలిక వచ్చింది. అతడి కుడి చేతి మణికట్టు, కుడి కాలి పాదం, మడమల్లో గాయాలు అయ్యాయి. వెన్నెముక భాగంలోనూ కాలిన గాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అతడి పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రాథమిక చికిత్స తర్వాత డెహ్రాడూన్‌లోని మాక్స్‌ ఆస్పత్రికి తరలించాం' అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది.


'పంత్‌ గాయాల తీవ్రత తెలుసుకొనేందుకు ఎమ్మారై స్కానింగ్‌ చేస్తున్నారు. ఏమైందో తెలియగానే పూర్తి స్థాయి చికిత్స చేస్తారు. పంత్‌ కుటుంబ సభ్యులు, వైద్య బృందంలోని డాక్టర్లతో బీసీసీఐ నిరంతరం సంప్రదిస్తూనే ఉంది. వైద్యులు అతడికి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు' అని బీసీసీఐ వెల్లడించింది.