Gutta Sukender Reddy Fires On BJP: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మత పిచ్చి ముదిరిపోతోందని విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ తన బలాన్ని నిరూపించుకునేందుకు బలవంతంగా మునుగోడు ఉపఎన్నికను తీసుకు వచ్చిందని గుత్తా విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు చాలా డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
రోజుకు ఒకరు ఇద్దరు చొప్పున కేంద్ర మంత్రులు మునుగోడులో పర్యటిస్తున్నారని శాసన మండలి ఛైర్మన్ విమర్శించారు. మునుగోడులో ఎన్ని డబ్బులు పంచి పెట్టినా.. అక్కడ ఎగిరేది గులాబీ జెండా అని, గెలిచేది తమ అభ్యర్థేనని గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ డబ్బులు పంచి పెడుతోందని విమర్శించారు.
'కేంద్ర సంస్థల దాడులతో బెదిరింపులు'
ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర సంస్థలు, దర్యాప్తు సంస్థలు తమ చెప్పు చేతుల్లో ఉండటంతో... రాష్ట్రంలో దాడులు చేయిస్తున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్ర బీజేపీ నాయకులపై ఆయన ఆరోపణలు చేశారు. కె. చంద్రశేఖర్ రావును అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఒక వైపు మునుగోడు ఉపఎన్నిక, మరోవైపు ఈడీ, సీబీఐ దాడులతో టీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తోందని గుత్తా మండిపడ్డారు. ఇప్పటికి అయినా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం కోసం ఆలోచించాలని, రాష్ట్రాల మీద పెత్తనాలు చేయడం తగ్గించుకోవాలని సూచించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ అభ్యర్థికి ఓట్లు పడేలా చేయాలని కేంద్ర మంత్రులను పంపిస్తోందని ఆరోపణలు చేశారు.
'మునుగోడు ప్రజలు చైతన్యవంతులు'
మునుగోడు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. బీజేపీ నాయకుల జిమ్మిక్కులకు పడిపోరని అన్నారు. మత కల్లోలాలు రేపే బీజేపీని ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిపించరని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ అసమర్ధ పాలన వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పడిపోయిందని, ఇంకా పడిపోతూనే ఉందని ఆయన విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టడం మాని, మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను బీజేపీ సర్కారు చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
'వాటిపై ఉన్న శ్రద్ధ దేశంపై లేదు'
దేశాన్ని అభివృద్ధి చేయడంలో, ఆర్థికంగా పుష్టిగా మార్చడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అన్నారు. మత విద్వేషాలు సృష్టించడంపై ఉన్న శ్రద్ధ.. వేరే ఇతర అంశాలపై లేదని చెప్పారు. మోదీ సర్కారు పాలన వైఫల్యాలతో దేశ లౌకికవాదం, మత సామరస్యానికి విఘాతం కలుగుతోందని తెలిపారు.