TSPSC Group 2 Exam Dates: లక్షలాది మంది విద్యార్థుల అభ్యర్థించడంతో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ తేదీలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో సీఎం కేసీఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్ ను రీ షెడ్యూల్ చేయాలని సూచించారు. సీఎస్ శాంతికుమారి, TSPSC చైర్మన్, కార్యదర్శులతో ఈ విషయంపై చర్చించారు. తాజాగా టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 2, 3 తేదీలలో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు 2 సెషన్లలో మొత్తం 4 పేపర్ల పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు.


భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కావొద్దు- కేసీఆర్ ఆదేశాలు.. 
భవిష్యత్తులో కమిషన్ విడుదల చేసే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు ఒకేసారి ఎగ్జామ్ నిర్వహించేలా కాకుండా, అభ్యర్థులు ప్రిపరేషన్ కు తగిన సమయం ఉండేలా ప్లాన్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్‌పీఎస్సీతో చర్చించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సీఎస్ ను సీఎం కేసీఆర్ శనివారం ఆదేశించారు. అలా ప్లాన్ ప్రకారం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా అర్హులైన అందరు అభ్యర్థులు అన్ని పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవకాశం ఉంటుందని కేసీఆర్ సూచించారు. 




పరీక్షలకు హాజరుకానున్న 5.5 లక్షల అభ్యర్థులు..
రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్‌-2 పోస్టులకు సంబంధించి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఓఎంఆర్‌ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాక డబుల్‌ బబ్లింగ్‌పై న్యాయవివాదాలు తలెత్తాయి. దీంతో ఫలితాల వెల్లడికి దాదాపు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ప్రస్తుతం గ్రూప్‌-2 నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా, వివాదాలకు ఆస్కారం లేకుండా కమిషన్‌ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలు, కళాశాలలకు జిల్లా విద్యాధికారులు, ఇంటర్‌బోర్డు ద్వారా సమాచారం పంపించింది. వారాంతపు సెలవుల్లో పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ, అప్పటికే వేర్వేరు కేంద్రప్రభుత్వ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. దీంతో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. కానీ అభ్యర్థులు రిక్వెస్ట్ చేయడంతో నవంబర్ 2, 3 తేదీలలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.


తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు.గ్రూప్‌-2 పోస్టులకు మొత్తం 5,51,943 దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.