Rythu Bharosa funds: తెలంగాణలో రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఐదు ఎకరాలు పైబడిన రైతులు అందరికీ ఈ నిధులు జమ అయినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులను మే 6 నుంచి రైతుల అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించింది. 3 రోజులపాటు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా.


రైతు భరోసాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధుగా పిలిచేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిధులను సకాలంలో రైతులకు జమ చేయలేదని బీఆర్ఎస్ కీలక నేతలు ఇటీవలి ఎన్నికల ప్రచారంలో తరచూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ నిధులను డిసెంబరులోనే జమ చేయడం మొదలుపెట్టామని.. మొత్తం 69 లక్షల మంది రైతులకు గాను ఇప్పటివరకు 65 లక్షల మందికి అందించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన 4 లక్షల మంది ఖాతాల్లోకి మే 9వ తేదీలోపు రైతు భరోసా నిధులను వేస్తామని చెప్పారు. 


ఖమ్మం నుంచి అలంపూర్‌ వరకు ఏ ఒక్క రైతుకు రైతు భరోసా నిధులు అందకపోయినా తాను హైదరాబాద్ లోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి.. బహిరంగ చర్చలో పాల్గొని, ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమని అన్నారు. ఒకవేళ 9లోపు రైతులందరికీ మిగిలిన రూ.7,500 కోట్లు జమ చేస్తే.. తమకు కేసీఆర్ క్షమాపణలు చెప్పగలరా అని సవాలు విసిరారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా’’ అని ప్రశ్నించారు.