Viral Video: క్రికెట్ ఆడడం సరదానే. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. 11 ఏళ్ల బాలుడికి ఇదే జరిగింది. మహారాష్ట్రలోని పుణేలో బాక్స్ క్రికెట్ ఆడుతుండగా బాల్ మర్మాంగంపై గట్టిగా తాకింది. ఆ దెబ్బని తట్టుకోలేక అక్కడికక్కడే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రెండ్స్‌తో కలిసి కాసేపు క్రికెట్ ఆడదామని వెళ్లిన కొడుకు ఇలా చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం జరిగిందంటే...శంభు కాళిదాస్ అలియాస్ శౌర్య స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. అప్పటి వరకూ అంతా సరదాగా ఉన్నారు. శౌర్య బౌలింగ్ వేశాడు. బ్యాట్స్‌మెన్ ఆ బాల్‌ని చాలా గట్టిగా కొట్టాడు. ఆ బాల్ నేరుగా వచ్చి బాలుడి ప్రైవేట్ పార్ట్‌కి బలంగా తాకింది. ఆ ధాటికి వెంటనే కింద పడిపోయాడు. స్నేహితులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏమైందో అర్థం కాక భయపడిపోయారు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికే బాధితుడు స్పృహ కోల్పోయాడు. హాస్పిటల్‌కి తీసుకెళ్లిన కాసేపటికే మృతి చెందాడు. మే 2వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.
"ఓ స్పోర్ట్స్ అకాడమీలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు శౌర్య వెళ్లాడు. బౌలింగ్ వేసిన సమయంలో బ్యాటర్ చాలా గట్టిగా దాన్ని కొట్టాడు. ఆ బాల్ నేరుగా శౌర్య ప్రైవేట్ పార్ట్‌కి తగిలింది. ఈ ధాటికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. విచారణ జరుపుతున్నాం. అటాప్సీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే తోటి స్నేహితులతో మాట్లాడుతున్నాం"
- పోలీస్ అధికారులు