Ec Orders On Anantapuram DIG Transfer: ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పలువురు అధికారులపై వస్తోన్న ఫిర్యాదుల ఆధారంగా ఈసీ బదిలీ వేటు వేస్తోంది. తాజాగా, అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని (Ammiredddy) బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. ఆయనకు ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది. ఆ బాధ్యతలను దిగువ స్థాయి అధికారులకు అప్పగించాలని నిర్దేశించింది. కాగా, అధికార వైసీపీకి అమ్మిరెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను బదిలీ చేసిన ఈసీ.. ఆయన స్థానంలో అమిత్ బర్దర్ ను నియమించింది. వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులతోనే అన్బురాజన్ ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, అనంతపురం అర్బన్ డీఎస్పీగా వీరరాఘవరెడ్డి స్థానంలో టీ.వీ.వీ ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా సయ్యద్ అహ్మద్ భాషా స్థానంలో రామచంద్రరావును నియమిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు స్వీకరించాలని కొత్త డీఎస్పీలను ఆదేశించింది.