Rail Track on Moon: చంద్రుడిపైన దిగి అక్కడ ఓ చోట నుంచి మరో చోటకు రైల్‌లో (Lunar Rail System) ప్రయాణిస్తే ఎలా ఉంటుంది..? మరీ ఫాంటసీలాగా ఉంది కదా. కానీ...సైన్స్ తలుచుకుంటే ఇలాంటి ఫాంటసీలన్నీ నిజాలైపోతాయి మరి. ఇప్పుడు నాసా (NASA) ఇదే పనిలో ఉంది. అంతరిక్ష రంగంలో అసాధ్యాలన్నీ సుసాధ్యం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు సైంటిస్ట్‌లు. ప్రస్తుతం ఈ సైన్స్‌ ఫిక్షన్‌పైనే ఫోకస్ పెట్టారు. ఎప్పటికైనా సరే చంద్రుడిపై రైల్వే ట్రాక్‌ వేస్తామని అంటోంది నాసా. అయితే..ఎప్పటికి ఇది పూర్తవుతుందన్నది మాత్రం చెప్పలేమని, తాము లక్ష్యంగా పెట్టుకున్న ఏరోస్పేస్ మిషన్స్‌లో ఇదీ ఒకటని వివరిస్తోంది. 


నాసా ప్రాజెక్ట్‌లు ఇవే..
 
ఈ సైన్స్‌ ఫిక్షన్ తరహా మిషన్స్‌లో కీలకమైనవి ఉన్నాయి. ఫ్యూయిడ్ బేస్డ్‌ టెలిస్కోప్, మార్స్‌కి మనుషులను తీసుకెళ్లేందుకు రవాణా వ్యవస్థను తయారు చేయడం, కార్గోని మార్స్‌పైకి తీసుకెళ్లడం, లూనార్ రైల్వే సిస్టమ్...ఈ లిస్ట్‌లో ఉన్నాయి.  Innovative Advanced Concepts (NIAC) ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ మిషన్స్‌ని పట్టాలెక్కించాలని భావిస్తోంది నాసా. అయితే...వీటిపై చాలా ఏళ్ల పాటు పరిశోధన చేయాల్సి ఉంటుంది. అందుకోసం పెద్ద ఎత్తున నిధులూ అవసరమవుతాయి. ఇప్పటికే ఆరు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పరిశోధన కొనసాగుతోంది. ఫేజ్‌ 2 వరకూ వెళ్లిన అధ్యయనాలున్నాయి. వచ్చే రెండేళ్ల పాటు వీటిపై రీసెర్చ్ చేసేందుకు 60 లక్షల డాలర్ల నిధులు అవసరమవుతాయి. కానీ...ఈ ప్రాజెక్ట్‌లు కచ్చితంగా సక్సెస్ అవుతాయన్న గ్యారెంటీ అయితే లేదని చెబుతోంది నాసా. ఎంత పరిశోధన చేసినప్పటికీ కొన్ని ప్రాక్టికల్‌గా వర్కౌట్ కాకపోవచ్చని ఈ సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. కానీ...భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి మిషన్స్‌ అవసరం ఉందని చెప్పడమే తమ ఉద్దేశమని చెబుతున్నారు. 10 మీటర్ల కన్నా పెద్ద టెలిస్కోప్ తయారు చేయడం స్పేస్ టెలిస్కోప్ టెక్నాలజీలో ప్రస్తుతానికి కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అని అంటున్నారు.