Runa Mafi In Telangana Guidelines: తెలంగాణలో రూ.రెండు లక్షలలోపు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేయనున్నారు. రేషన్ కార్డు ప్రాతిపదికన రైతు కుటుంబాలను గుర్తించనున్నారు. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకూ రుణాలు తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీ వర్తించనుంది.
అన్ని వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రైతులు ఈ కాలంలో రుణాలు తీసుకుంటే వారికి కూడా రుణమాఫీ వర్తించనుంది. అంతేకాక, రైతుల రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల లోన్ ఖాతాల్లోనే జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును విడుదల చేయనున్నట్లుగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు ఈ మాఫీ వర్తించడం లేదు. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ చూడొచ్చని.. లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.