New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల (Ration Cards) స్వరూపం మార్చేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న రేషన్/ఆహార భద్రత కార్డుల (Food Security Cards) భౌతిక స్వరూపం మార్చాలనే యోచనలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆగిందని, కోడ్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన కసరత్తు మొదలవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త కార్డు ఎలా ఉండాలి? దాని స్వరూపం ఏంటనే విషయంపై ఎన్నికల కోడ్ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది.
తెలంగాణ వ్యాప్తంగా 89,98,546 ఆహార భద్రత కార్డులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఓ చిన్న పుస్తకంలా ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫొటో, కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు ఉండేవి. ఆ తర్వాత రైతుబంధు పాస్‌బుక్ సైజ్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్‌కార్డులు జారీ చేసింది. ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫొటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. వెనుకవైపు చిరునామా, ఇతర వివరాలు పొందు పరిచేవారు.
ఆ తర్వాత రేషన్‌కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఇవి ఒక పేజీ మాత్రమే ఉండేవి. ఇందులో ఒక వైపు మాత్రమే కార్డుదారుడు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం, కార్డు సంఖ్య మాత్రమే ఉంటాయి. అలాగే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటో ఉండదు. ఇప్పుడు కొత్త కార్డులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. కార్డు ఎలా ఉండాలనే విషయంపై ఎన్నికల కోడ్ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలిసింది.
ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిన ప్రభుత్వం
ఆరోగ్యశ్రీ కార్డు చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గతంలో ఆరోగ్య శ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు చికిత్స చేసుకునే సౌకర్యం ఉండగా దానిని.. ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కొత్త ప్రయోజనాలను వివరిస్తూ పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చిన ప్రభుత్వం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాహన రిజిస్ట్రేషన్ మార్క్‌లో మార్పు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో కేంద్రం తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ సిరీస్‌ను టీఎస్ నుంచి టీజీకి మార్పు చేస్తూ మార్చి 12న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలతో గెజిట్ నోటిఫికేషన్‌లో మార్పు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది.
జిల్లా పేర్లు మార్చేందుకు నిర్ణయం
తెలంగాణలో రెండు జిల్లాల పేర్లు మార్చనున్నట్లు గతంలో సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రాయంగా తెలిపారు. జనగామ జిల్లాకు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు, ఉమ్మడి వరంగల్‌లోని ఏదైనా జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టే యోచనలో ఉన్నట్లు సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ అంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వం భూపాల పల్లి జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ అని, గద్వాలకు శక్తిపీఠం జోగులాంబ అని, భూవనగిరి జిల్లాకు యాదాద్రి, కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి, ఆసిఫాబాద్ జిల్లాకు కొమురం భీం, సిరిసిల్ల జిల్లాకు వేములవాడ రాజన్న అంటూ చారిత్రక నేపథ్యం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే.