Rahul Tripathi Run Out: క్వాలిఫయర్‌ వన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH)ను చిత్తు చేసిన కోల్‌కత్తా(KKR)... ఫైనల్లో అడుగుపెట్టింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ తేలిపోయింది.  హైదరాబాద్‌ ఓపెనర్లు ట్రానిస్‌ హెడ్, అభిషేక్‌ శర్మలు తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో.. క్వాలిఫయర్‌-1లో కనీస పోటీ అయినా ఇవ్వకుండానే కోల్‌కతాకు హైదరాబాద్‌ తలవంచింది. స్టార్క్‌ బంతితో హైదరాబాద్‌ పతనాన్ని శాసించాడు. 6.2 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  హైదరాబాద్‌ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్‌ త్రిపాఠి 35 బంతుల్లో 55 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ లక్ష్యాన్ని కోల్‌కత్తా మరో 38 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ 51 నాటౌట్‌; శ్రేయస్‌ అయ్యర్‌ 58 నాటౌట్‌ చెలరేగడంతో కోల్‌కతా ఘన విజయం సాధించింది. అయితే అత్యంత క్లిష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రాహుల్‌ త్రిపాఠి రనౌట్‌ అయిన తర్వాత తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మెట్లపై కూర్చొని రాహుల్‌ ఏడుస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాను దున్నేస్తున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్ల కామెంట్లతో సోషల్‌ మీడియాకు హీటెక్కింది.

త్రిపాఠి ఏడ్చేశాడా..!
కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రాహుల్‌ త్రిపాఠి రన్ అవుట్ అయిన తర్వాత మెట్ల మీద ఒంటరిగా కూర్చున్నాడు. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్‌ త్రిపాఠినే. ఇలా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన త్రిపాఠి.. అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. అప్పటికే ఈ బ్యాటర్‌ 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. 14వ ఓవర్ రెండో బంతికి ఆండ్రీ రస్సెల్ చేసిన అద్భుతమైన ఫీల్డింగ్‌కు త్రిపాఠి రనౌట్ అయ్యాడు. రన్ అవుట్ అయిన తర్వాత త్రిపాఠి భావోద్వేగానికి గురయ్యాడు. రనౌట్‌ కావడాన్ని త్రిపాఠి జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఉద్వేగానికి లోనయ్యాడు. అవుటైన తర్వాత మెట్లపై ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. త్రిపాఠి పోరాటాన్ని కొనియాడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని కొందరు... చాలా బాగా ఆడావని మరికొందరు త్రిపాఠికి మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. మరో అవకాశం ఉందని ఆ మ్యాచ్‌లో రాణించవచ్చని ధైర్యం చెబుతున్నారు. 


త్రిపాఠి మినహా అందరూ విఫలం
కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ త్రిపాఠి 35 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 55 పరుగులు చేశాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌, కమిన్స్‌ కాస్త పోరాడారు. కానీ మిగిలిన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ట్రానిస్‌ హెడ్‌ 0, అభిషేక్‌ శర్మ 3, నితీశ్‌కుమార్‌ రెడ్డి 9, షాబాజ్ అహ్మద్‌ 0, అబ్దుల్‌ సమద్‌ 16, సన్వీర్‌ సింగ్‌ 0, భువనేశ్వర్‌ కుమార్‌ 0, వియస్కాంత్‌ ఏడు పరుగులకే పెవిలియన్‌ చేరారు. హైదరాబాద్‌ బ్యాటర్లలో ఏడుగురు కనీసం పది పరుగుల మార్క్‌ను కూడా దాటలేదు.