KKR vs SRH Qualifier 1, IPL 2024: అదరగొట్టే ఆటతో కోల్‌కతా(KKR) ఫైనల్ లోకి దూసుకుపోయింది. హైదరాబాద్‌(SRH)తో జరిగిన క్వాలిఫయర్‌ 1లో  8 వికెట్ల తేడాతో  ఘన  విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇచ్చిన 160 పరుగుల లక్ష్యాన్ని  13.4 ఓవర్లలోనే ఛేదించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో గెలుపుతో కోల్‌కతా డైరెక్ట్ గా ఫైనల్స్కి చేరుకోగా  ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫయర్స్-2లో మరోసారి సత్తా చూపాల్సిన  పరిస్థితి ఏర్పడింది.   22 వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB), రాజస్థాన్ రాయల్స్(RR) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో సన్ రైజర్స్ ఈ నెల 24న  క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది.


ఈ మ్యాచ్ లో హైదరాబాద్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన  కోల్‌కతా అలవోకగా ఆడిపడేసింది. 44 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా నరైన్, వెంకటేశ్ అయ్యర్ లు నిలకడగా ఆడటంతో పవర్‌ ప్లే ముగిసేసరికి స్కోరు ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులలో ఉంది. అయితే 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నరేన్ కూడా  అవుట్ అయ్యాడు. అయితే  వెంకటేశ్‌ అయ్యర్‌ 51 పరుగులు, శ్రేయస్‌ అయ్యర్‌  58 పరుగులతో  కోల్‌కతాను సునాయాసంగా గెలిపించారు. హైదరాబాద్ బౌలర్లు బ్యాటింగ్ లోనే కాదు పరుగులు కట్టడి చేయడంలో కూడా  విఫలమయ్యారు. కేవలం కమిన్స్, నటరాజన్ తప్ప మిగత వాళ్లు వికెట్ తీయలేకపోయారు. 


 తడబడ్డ హైదరాబాద్  బ్యాటర్లు 
 టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు తొలి ఓవర్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నట్రానిస్‌ హెడ్‌  స్కోరు బోర్డుపై  ఒక్క పరుగు లేకుండానే   మిచెల్‌ స్టార్క్‌ దెబ్బకి  క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. కాసేపటికే అరోరా మరో వికెట్‌ నేలకూల్చి హైదరాబాద్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.  నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేసిన అభిషేక్ శర్మను అరోరా అవుట్‌ చేశాడు. ఆ తర్వాత ఎదుర్కొన్న తొలి బంతికే షాబాజ్‌ అహ్మద్‌ అవుట్‌ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన మిచెల్‌ స్టార్క్‌ హైదరాబాద్‌ను  పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు. స్టార్క్‌ విజృంభించడంతో హైదరాబాద్‌ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్‌ త్రిపాఠి మాత్రం  హైదరాబాద్‌ను ఆదుకున్నాడు. హెన్రిట్‌ క్లాసెన్‌తో కలిసి త్రిపాఠి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి హైదరాబాద్‌ను మళ్లీ పోటీలోకి తెచ్చారు. కానీ కీలక సమయంలో హెన్రిచ్‌ క్లాసెన్‌ అవుట్‌ కావడంతో హైదరాబాద్‌ మళ్లీ కష్టాల్లో పడింది. క్లాసెన్‌ అవుట్‌ అవ్వడంతో మళ్లీ హైదరాబాద్‌ వికెట్ల పతనం ప్రారంభమైంది. సన్వీర్‌సింగ్‌ ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్‌ అయ్యాడు.  అబ్ద్లుల్ సమద్‌ కూడా 16 పరుగులు చేసి హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో కెప్టెన్‌ కమిన్స్‌ పోరాడడంతో హైదరాబాద్‌ నిర్ణీత  19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.  కోల్‌కత్తా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ మూడు,  వరుణ్‌ చక్రవర్తి రెండు, అరోరా, నరైన్‌,  హర్షిత్‌ రాణా, రస్సెల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.