గవర్నమెంట్ స్కూళ్లలో చక్కని మౌలిక వసతులు, నాణ్యమైన విద్య లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ‘మన ఊరు – మన బడి’ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు భాగస్వాములు అయ్యేలా అవకాశం కల్పించారు. వారు విరాళాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ఏదైనా ప్రభుత్వ పాఠశాలకు రూ.కోటి లేదా అంతకన్నా ఎక్కువ విరాళం ఇస్తే.. వారి పేరు లేదా వారు సూచించిన వారి పేర్లను గవర్నమెంట్ స్కూళ్లకు పెడతామని మంత్రి ప్రకటించారు. విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శనివారం తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వివరాలు చెప్పారు.
దీనికి ప్రత్యేక వెబ్‌సైట్
‘మన ఊరు – మన బడి’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.7,289 కోట్లతో సుమారు 26 వేల స్కూళ్లను అభివృద్ధి చేయనుందని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఎవరు ఇచ్చినా వారు సూచించిన పేరును పాఠశాలకు పెడతామని కేటీఆర్ చెప్పారు. అయితే, రూ.10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ విరాళం ఇచ్చేవారికి మాత్రం తరగతి గదులకు పేర్లు పెడతామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పెద్ద మనసుతో సాయం చేసేందుకు ముందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.
రాష్ట్ర ఆవిర్భావంతో విద్యా రంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని, మన ఊరు - మన బడితో ప్రభుత్వ పాఠశాలలు సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చే ఎన్నారైలకు విద్యా శాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. తొలి విడతలో 60 శాతంపైగా విద్యార్థులు చదివే 35 శాతం పాఠశాల లను ఎంపిక చేసి, ఆయా పాఠశాలను అభివృద్ధి చేసే ప్రక్రియను ఓ యజ్ఞంలా చేపట్టనున్నట్లు ప్రకటించారు.
గ్రామాల్లో ‘మన ఊరు–మన బడి’, పట్టణాల్లో ‘మన బస్తీ– మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముందుకెళ్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 12 అంశాలతో రాష్ట్రంలోని 9,123 పాఠ శాలలను మొదటి దశలో అభివృద్ధి చేయ నున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.