ఓ భార్య తాను కట్టుకున్న భర్తను ఏకంగా పశువుల చావిడిలో పాతి పెట్టింది. గొడవలో భర్త చనిపోగా.. ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు ఆమె ఈ ప్రణాళిక రచించింది. పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్న వారి సంసారంలో మద్యమే చిచ్చు రేపింది. అది మానాలనే భార్య డిమాండ్ చేయగా.. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య భౌతిక దాడులు చేసుకొనే వరకూ వెళ్లింది. చివరికి ఆ తగువులో భర్త ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో భార్య శవాన్ని మాయం చేసే క్రమంలోనే పశువుల కొట్టంలో గొయ్యి తీసి భర్తను పాతి పెట్టింది.
ఈ ఘటన గుంటూరు జిల్లా పూడివాడలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పూడివాడలో దంపతులు కర్రి వెంకటేశ్వరరావు - ఆదిలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 8వ తేదీన రాత్రి వీరు ఇద్దరూ గొడవపడ్డారు. ఈ వివాదంలో భర్త మరణించాడు. తాగిన మైకంలో ఉన్న భర్తకు, భార్యకు మధ్య తోపులాట చోటుచేసుకున్న క్రమంలో వెంకటేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడు. విషయాన్ని కప్పిపుచ్చేందుకు భర్త శవాన్ని పశువుల పాకలో పాతిపెట్టింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నాలుగు రోజులుగా కొడుకు కనిపించకపోవడంతో కర్రి వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. దీంతో మృతుని తండ్రి అచ్చియ్య కోడలు ఆదిలక్ష్మిని నిలదీశాడు. ఫూటుగా తాగి వచ్చి తనను కొట్టడంతో గట్టిగా తోశానని చెప్పింది. దాందో అతను గోడకు తగిలి తన భర్త చనిపోయాడని వివరించింది. దీంతో ఆయన కంగుతిన్నాడు. బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, రేపల్లె రూరల్ సీఐ శివశంకర్ శనివారం సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అతని శవాన్ని పశువుల కొట్టంలో పాతి పెట్టినట్లుగా గుర్తించి దాన్ని వెలికి తీశారు.
అయితే, కర్రి వెంకటేశ్వరరావు మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శవాన్ని పూడ్చడం ఒకరి వల్ల అయ్యే పని కాదని అర్థం అవుతోంది. ఆమె ఇంకెవరి ప్రమేయంతోనో ఇలా చేసి ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తోపులాటలో చనిపోయాడా.. లేక మృతికి కారణాలు ఏంటనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.