TS Liquor Sales : మందుబాబులకు తెలంగాణ సర్కార్ న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. నూతన సంవత్సర వేడుకలకు మద్యం విక్రయాల టైం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బార్ అండ్ రెస్టారెంట్లలో అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకాలకు పర్మిషన్ గ్రాంట్ చేసింది. మందుబాబులు డిసెంబర్ 31న మద్యం షాపుల ముందు క్యూలు కడుతుంటారు. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారిస్తారు. ఈ టైంలో మద్యం షాపులు ముందుగానే మూతపడడంతో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఫీలయ్యే మందుబాబుల కోసం 31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. బార్లు, పబ్బులు, మద్యం షాపులు తెరిచి ఉండే సమయాన్ని పొడిగించింది.  


అర్ధరాత్రి వరకు అమ్మకాలు 


డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్‌లు అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలు చేయవచ్చని పర్మిషన్ ఇచ్చారు. కరోనా సమయంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయి నష్టపోవడంతో  లైసెన్స్‌లు పొందిన షాపు యజమానులు, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా ఈ వెసులుబాటు కల్పించినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్యంలో మునిగితేలి ప్రభుత్వ ఖజానా నింపుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ఒక్క హైదరాబాద్ లోనే వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈసారి పాత రికార్డులు బద్దలుకొట్టేందుకు మందుబాబులు సిద్ధమయ్యారు. 


న్యూఇయర్ టైంలో ఈ రూట్స్ లో వెళ్లొద్దు 


కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత నూతన సంవత్సర వేడుకలు పూర్తి స్థాయిలో జరగనున్నాయి. భాగ్యనగర వాసులంతా న్యూ ఇయర్ వేడుకల కోసం తెగ రెడీ అవుతున్నారు. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈనెల 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీన తెల్లవారుజాము వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డులతోపాటు ఫ్లైఓవర్లు మూసి వేసే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్, సరైన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తేనే ఆయా రోడ్లలో అనుమతి ఇస్తారని పేర్కొంది. మద్యం మత్తులో వాహనాలు నడిపినా, ర్యాష్ డ్రైవింగ్, బైక్ లపై విన్యాసాలు చేసినా, మైనర్లు డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరుస్తారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్సులు మూడు నెలలు లేదా శాశ్వతంగా రద్దు చేస్తారని ట్రాఫిక్ పోలీసులు. 


పోలీసుల ఆంక్షలు 


డిసెంబర్ 31న వేడుకలకు  హడావుడి మొదలైంది. హోటళ్లు, రిసార్టులు, క్లబ్బులు న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు నిబంధనలు విధించారు. త్రీ స్టార్‌ అంతకన్నా పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బులకు కొన్ని నిబంధనలు పెట్టారు.  డిసెంబర్ 31న రాత్రి 1 గంట వరకు నిర్వహించే వేడుకలకు ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించారు. వేడుకల జరిగే ప్రదేశాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ లలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలని నిబంధన పెట్టారు. వేడుకల్లో సౌండ్ సిస్టిమ్ శబ్ధం 45 డెసిబెల్స్ పరిమితి మించకూడదన్నారు. ఈ వేడుకల్లో మద్యం సేవించిన వారు డ్రైవింగ్‌ చేయకుండా, వారు ఇంటికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేల ఫైన్ తో పాటు 6 నెలల జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.