Telangana School Holidays: రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇవాళ, రేపు ( బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.




ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జులై 26, 27 తేదీలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవు దినాలుగా ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బుధ, గురువారాల్లో అన్ని పాఠశాలలకు సెలవులు అని వెల్లడించారు.


ఇటీవల మూడు రోజులు సెలవులు.. 
రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా ఇప్పటికే గురువారం (జులై 20), శుక్రవారం (జులై 21) తేదీల్లో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలువులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జులై 22న కూడా సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యాసంస్థలు జులై 23న ఆదివారం కావడంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి సోమవారం (జులై 24న) తెరచుకున్నాయి. జులై 24, 25 తేదీల్లోనూ పలు జిల్లాల్లో వర్షం కురవడంతో ప్రజలతో పాటు స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడనం తీవ్ర రూపం దాల్చి వాయుగుండంగా మారుతుండటంతో మరో రెండు నుంచి మూడు రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం సైతం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రజలను అప్రమత్తం చేశారు.


తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ లో మార్పులు, విద్యాశాఖ ఉత్తర్వులు
విద్యా సంస్థల పనివేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. ప్రైమరీ స్కూల్ వాళ్లకు (1 నుండి 5వ తరగతి వరకు) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల స్కూల్ టైమ్ నిర్ణయించారు. ఉన్నత ప్రాథమిక పాఠశాల అంటే 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల స్కూల్ టైమింగ్స్ ను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటలుగా నిర్ణయించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పనివేళల్లో మార్పులు అమలులోకి వస్తాయని రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్.జేడీఎస్ఈలకు విద్యాశాఖ ఈ ఉత్తర్వులు పంపించింది. స్కూల్ యాజమాన్యాలకు సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చిన్నాపిల్లలని ఉదయం త్వరగా నిద్రలేవలేరని వారికి 9.30 గంటలకు తరగతులు మొదలు కావాలని కొందరు ప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆలోచించిన విద్యాశాఖ తాజాగా స్కూల్ పనివేళలను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial