Rythu Bharosa News: రైతు భరోసా (బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు) పథకానికి సీలింగ్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఐదు లేదా 10 ఎకరాల భూమి ఉన్న వారికే పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు ఎంత భూమి ఉన్నా సరే పెట్టుబడి సాయాన్ని మాత్రం ఐదు లేదా 10 ఎకరాల వరకే అందించే దిశగా సర్కార్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అర్హత గల రైతులకు మాత్రమే సాయం అందేలా పకడ్బంధీ విధివిధాలను రూపొందించే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది.
పంట పెట్టుబడి సాయం కోసం ప్రతి ఎకరాకు రూ. 15 వేలు అందజేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఈ ఖరీఫ్ సీజన్ నుంచి పంట పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే గతంలో రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించేవారు. ఇదే పథకాన్ని రైతు భరోసాగా పేరుమార్చి ఎకరాకు రూ. 15 వేలు రెండు విడతల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అప్పట్లో ఎలాంటి పరిమితుల్లేవు
గత కేసీఆర్ సర్కార్ హయాంలో రైతుబంధు పథకానికి ఎలాంటి పరిమితులు లేవు. రైతు పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు పంట పెట్టుబడి సాయం అందింది. ఎకరానికి ఏటా రెండు విడతల్లో కలిపి రూ. 10 వేలు సాయాన్ని రైతుల ఖాతాల్లో బీఆర్ఎస్ సర్కార్ జమ చేసింది. అయితే నిజమైన రైతులు కాని వారికి కూడా రైతు బంధు సాయం అందిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే వందలాది ఎకరాలు ఉన్న వాళ్లు, అసలు వ్యవసాయమే చేయని వాళ్లు, కోటీశ్వరులు, ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారికి రైతు బంధు సాయం అందించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలు, పడావు భూములకు కూడా రైతుబంధు అందిందనే ఆరోపణలు వచ్చాయి.
తగ్గనున్న ఆర్థిక భారం
దీంతో ఈసారి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం రైతుబంధు పథకానికి పరిమితి విధించాలని యోచిస్తోంది. దీని ద్వారా అసలైన లబ్ధిదారులకు సాయం అందించడమే కాకుండా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుంది. కోటీశ్వరులు, ఆదాయ పన్ను కట్టే వారికి రైతుబంధు ఇవ్వబోమని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. అలాగే సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంటే వ్యవసాయం చేసే నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసాను ప్రభుత్వం అందిస్తుంది. కొండలు, గుట్టలు, పడావు భూవులు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఉన్న వారికి పంటపెట్టుబడి సాయాన్ని నిలిపి వేయనుంది.
21న మంత్రి వర్గ సమావేశం
రైతు బంధును ఐదు ఎకరాల వరకే పరిమితం చేయాలా? లేదా 10 ఎకరాల వరకు అందించాలా? అనే విషయంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు (జూన్ 21) జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అంతిమ నిర్ణయం తర్వాత త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులందరూ పంట పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా విధివిధానాలు ఖరారు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరి వద్ద 1.53 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీరిలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 64.75లక్షల మంది ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం రైతు బంధుకు సీలింగ్ విధిస్తుందన్న వార్త నేపథ్యంలో పెద్ద మొత్తంలో భూములు ఉన్న వాళ్లు తమ కుటుంబ సభ్యుల పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.