Telangana Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి తన మానవత్వాన్ని చాటుకొని అందరిచేత ప్రశంసలు పొందుతున్నారు. గవర్నర్ పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా చెన్నై సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో నడిరోడ్డుపై పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న గవర్నర్ తమిళిసై అతడిని చూసి వెంటనే కారు ఆపారు. గాయాలపాలైన అతడి వద్దకు వెళ్లి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూశారు. కాళ్లు, చేతులకు స్వయంగా తానే కట్లు కట్టి ప్రాథమిక చికిత్స చేశారు.
అనంతరం అంబులెన్స్ కు ఫోన్ చేసి అక్కడకు పిలిపించారు. ఆస్పత్రి వారితో గవర్నర్ మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ కు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు.. క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆస్పత్రులకు చేర్చడం వల్ల ప్రాణాలు కాపాడగలమని వివరించారు. రోడ్డుపై ఎవరైనా గాయాలతో కనిపిస్తే మనకు ఎందుకునే అనుకోకుండా.. వారికి సాయం చేయాలని సూచించారు.
గతంలో విమాన ప్రయాణం చేస్తుండగా.. చికిత్స
గవర్నర్ తమిళిసై.. దిల్లీ - హైదరాబాద్ ఇండిగో విమానంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి ప్రాథమిక చేశారు. ప్రయాణ సమయంలో ఛాతి నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన విమాన సిబ్బంది.. ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా అని అడగడంతో తమిళిసై స్పందించారు. వెంటనే అస్వస్థతకు గురైన వ్యక్తితి ప్రాథమిక చికిత్స అందించి ఉపశమనం కల్గించారు. ప్రాథమిక చికిత్సతో కోలుకున్న వ్యక్తి సహా ఇతర ప్రయాణికులు గవర్నర్ తమిళిసైకి కృజ్ఞతలు తెలిపారు. అలాగే విమానంలో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. విమాన ప్రయాణాల్లో వైద్యులు ఎరైనా ఉండే ముందే వారి వివరాలను అందుబాటులో ఉంచే విధానం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
విమాన సిబ్బందికి సీపీఆర్ పై కనీస అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తే బాగుంటుందని గవర్నర్ తమిళిసై అభిప్రాయం వ్యక్తం చేశారు. సిబ్బందితో పాటు సామాన్యులు కూడా సీపీఆర్ చేసే విధానంపై శిక్షణ తీసుకుంటే ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు వైద్యురాలిగా..
తమిళి సౌందర రాజన్ కేవలం తెలంగాణ గవర్నర్ గానే కాకుండా అటు పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా తన బాధ్యతలు కొనసాగిస్తున్నారు. వైద్య వృత్తి పట్ల ఆమెకు ఉన్న అనుభవంతో ఎక్కడికి వెళ్లినా తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైనపుడు చికిత్స చేయడానికి ముందుకు వస్తుంటారు. అలాగే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా ఆమె తన హోదాను మరిచి క్షేత్ర స్థాయిలో పర్యటించి మరీ బాధితులకు సాయం చేస్తారు.